కేంద్రం, బీసీ కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ

కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు నోటీసు జారీ చేసింది.

కేంద్రం, బీసీ కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ
Supreme Court
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 26, 2021 | 1:18 PM

Supreme court issues notice : కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు నోటీసు జారీ చేసింది. వెనుకబడిన వర్గాలకు కుల ఆధారిత జనాభా లెక్కలు సేకరణ జరపాలన్న పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. దేశంలో జనాభా లెక్కల ప్రక్రియలో కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు నిర్వహించాలని డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ అసెంబ్లీ గురువారం కుల ఆధారిత జనాభా లెక్కలు నిర్వహించడానికి అనుకూలంగా తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

కుల అధారిత గణన చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీజేఐ ఎస్ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ ఏడాది సేకరించే జనాభా లెక్కల ఫారంలో ఓబీసీ కులాల కాలమ్ కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు జిఎస్ మని, మహేషాచారి హాజరై వాదనలు వినిపించారు. దీంతో కేంద్రంలో పాటు జాతీయ బీసీ కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఇదిలావుంటే, అంతకుముందు 2011 జనాభా లెక్కల సందర్భంగా దేశంలో కుల ఆధారిత జనాభా లెక్కలు చేపట్టాలనే డిమాండ్ పెరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్ దీనిని మొదటి నుండి పట్టుబడుతున్నారు. స్వాతంత్ర్య రాకముందు ఉన్న లెక్కల ఆధారితంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారని వారు మండిపడ్డారు. దీంతో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులను కోల్పోతున్నారన్నారు.

సుప్రీంకోర్టు వాదనలపై బీహార్ ముఖ్యమంత్రి స్పందించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం కుల ప్రాతిపదికన ఉండాలని నితీష్ కుమార్ కేంద్రాన్ని కోరుతున్నారు. ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలి. జనాభా ప్రకారం దేశంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 1931 తరువాత దేశంలో కుల ఆధారిత జనాభా లెక్కలు జరగలేదని ముఖ్యమంత్రి చెప్పారు. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మతం ఆధారంగా జనాభా గణన జరిగింది. అదే విధంగా, అన్ని కులాల జనాభా గణన 2021 లో చేయాలి. జనాభా లెక్కల సమయంలో ప్రజలు తమ కులాన్ని ప్రస్తావించాలి. దీంతో అన్ని కులాల వాస్తవ సంఖ్యను స్పష్టమవుతుంది. తద్వారా రాజకీయంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు వీలువుతుందని నితీష్‌కుమార్ వెల్లడించారు.

కుల ఆధారిత జనాభా లెక్కలు చేయనంతవరకు వెనుకబడిన లేదా షెడ్యూల్డ్ కుల ప్రజల ప్రస్తుత రిజర్వేషన్ల పరిమితిని పొడిగించలేమని నితీష్ కుమార్ అన్నారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వ్ చేయని వర్గానికి చెందిన ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అయితే, దేశంలో 1931 సంవత్సరం తర్వాత వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు సరియైన గణన జరగలేదు. ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16,243డీ, 243టీ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జాబితా పూర్తిగా తప్పులతడకతో కూడికుని ఉందని, ఓబీసీ కులాల వారీగా లభించే డాటా పాతదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో బీసీలకు రాజ్యాంగపరమైన అవసరాలను నెరవేర్చలేకపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే 2021 సంవత్సంలో చేపట్టే జనగణన కులాల వారీగా లెక్కించాలని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.

Read Also…  తారాస్థాయికి చేరుతున్న ఉద్యోగుల విభేదాలు.. రెవెన్యూ అసోసియేషన్‌లో VRO సంఘం కలుస్తుందనే ప్రచారంతో రచ్చ