గ్రహణం వేళ.. ఆ రెండు ఆలయాలకు పోటెత్తిన భక్తులు

సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా.. దేశంలోని ఇతర ఆలయాలన్నీ మూసి ఉన్నా…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయి. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ పుష్కరిణిలో పట్టువిడుపు స్నానాలు ఆచరిస్తారు. ఏ గ్రహణమైనా.. ఆ రెండు ఆలయాలను మూయరు. గ్రహణ సమయంలో కూడా వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇంతకీ ఆ రెండు ఆలయాలు ఏవి..? ఆ విశేషాలు ఎంటో చూద్దాం. సూర్య, చంద్రగ్రహణాల సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. […]

గ్రహణం వేళ.. ఆ రెండు ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Follow us

|

Updated on: Dec 26, 2019 | 1:21 PM

సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా.. దేశంలోని ఇతర ఆలయాలన్నీ మూసి ఉన్నా…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయి. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ పుష్కరిణిలో పట్టువిడుపు స్నానాలు ఆచరిస్తారు. ఏ గ్రహణమైనా.. ఆ రెండు ఆలయాలను మూయరు. గ్రహణ సమయంలో కూడా వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇంతకీ ఆ రెండు ఆలయాలు ఏవి..? ఆ విశేషాలు ఎంటో చూద్దాం.

సూర్య, చంద్రగ్రహణాల సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. గ్రహణ సమయంలో రాహు కేతుల ప్రభావంతో దేవతల శక్తి సన్నగిల్లుతుందని భావించి ఇలా చేస్తారు. కానీ..చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉంది. ఈ కారణంగా.. గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. అందుకే గ్రహణం సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇదొక్కటే కాదు.. గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని… కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసేందుకు భక్తులు తరలి వస్తారు. ఇవాల్టి సంపూర్ణ సూర్య గ్రహణ సందర్భంగానూ.. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రాహు కేతు పూజలు చేశారు.

అటు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో కొలువుదీరిన కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం కూడా గ్రహణం రోజున తెరిచే ఉంటుంది. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణ సమయాల్లోనూ ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తుంటారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా గ్రహణ కాలంలో గుడితలుపులు మూయటం లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయని చెప్పారు. భక్తులు పాదగయ పుష్కరిణిలో పట్టువిడుపు స్నానాలు ఆచరిస్తారని వేదపండితులు తెలిపారు.