Weather Alert: రేపే కేరళకు రానున్న నైరుతి రుతుపవనాలు..

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా ఇవి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ బుధవారం అధికారికంగా తెలిపింది. గత ఏడాది జూన్‌ ఒకటినే నైరుతి రుతుపవనాలు రాగా ఈసారి కాస్త ఆలస్యంగా రానున్నాయి.

Weather Alert: రేపే కేరళకు రానున్న నైరుతి రుతుపవనాలు..
Weather Report

Updated on: Jun 08, 2023 | 9:39 AM

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా ఇవి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ బుధవారం అధికారికంగా తెలిపింది. గత ఏడాది జూన్‌ ఒకటినే నైరుతి రుతుపవనాలు రాగా ఈసారి కాస్త ఆలస్యంగా రానున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు శాఖ తెలిపింది. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని మొగలిద్దలో 6.9 సెంటీమీటర్లు, నల్గొండలోని నాంపల్లిలో 5.3, వికారాబాద్‌లోని బంట్వారంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో.. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది.

బుధవారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా తంగుళ్లలో 45.8, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వద్ద 41.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను తీవ్రత మరింత పెరిగింది. ఇది జూన్‌ 5న ఏర్పడగా బుధవారానికల్లా తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..