AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్.. అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..

స్నేహితుల వద్ద చేసిన అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు ఏకంగా తన కిడ్నాప్ డ్రామాకే తెరతీశాడు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించి తాను కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. వాట్సాప్‌లో కిడ్నాపర్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో 100 గంటల్లోనే ఈ హైటెక్ కిడ్నాప్ నాటకం బయటపడింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్.. అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..
Deepak Kumar
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 31, 2026 | 4:38 PM

Share

జల్సాలకు అలవాటు పడి స్నేహితుల వద్ద అప్పులు చేశాడు.. వాటిని తీర్చే దారి కనిపించక చివరకు ఓ వింత ప్లాన్ వేశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నట్లు నాటకమాడాడు. అందుకోసం ఏఐ (AI) సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించి కుటుంబ సభ్యులకు పంపించాడు. వాట్సాప్‌లో కిడ్నాపర్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే అతడి ప్లాన్ ఎక్కువ రోజులు సాగలేదు. 100 గంటల్లోనే పోలీసులు ఈ హైటెక్ కిడ్నాప్ డ్రామాకు తెరదించారు. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

రాజస్థాన్‌కు చెందిన దీపక్ కుమార్ (22) జైపుర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. స్నేహితులతో జల్సాలు చేస్తూ భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు రాబట్టాలని ప్లాన్ చేశాడు. అక్టోబర్ 26న కొందరు తనను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులకు ఫొటోలు, వీడియోలు పంపించాడు. తాను బందీగా ఉన్నట్లు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏఐతో నకిలీ దృశ్యాలు సృష్టించాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న జైపుర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జైపుర్, దిల్లీ, మథుర, ఉజ్జయిని, హల్ద్వానీ, నైనిటాల్, హరిద్వార్, రిషికేశ్ నగరాల్లో సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చివరకు రిషికేశ్‌లోని లక్ష్మణ్ ఝూలా సమీపంలో దీపక్ ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడింది. స్నేహితుల వద్ద చేసిన అప్పులు తీర్చుకునేందుకే ఈ కిడ్నాప్ నాటకానికి తెరతీసినట్లు అంగీకరించాడు. టెక్నాలజీ ఉపయోగించి కుటుంబాన్ని నమ్మించగలిగినా, పోలీసుల దర్యాప్తులో మాత్రం అతడి నాటకం బయటపడింది. ఇలాంటి తప్పుడు కిడ్నాప్ కథనాలతో పోలీసుల సమయం, వనరులను వృథా చేయొద్దని, తప్పుడు ఫిర్యాదులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Follow Us