లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు రేవణ్ణను లోతుగా ప్రశ్నిస్తోంది సిట్ బృందం. రెండో రోజు బెంగళూర్‌లో రేవణ్ణను విచారించారు. అయితే తనపై అక్రమంగా కేసులు పెట్టారని అంటున్నారు రేవణ్ణ. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వేధింపులు చూడలేదన్నారు. చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు రేవణ్ణ. బెంగళూర్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. లైంగిక నేరాలకు పాల్పడిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గురించి సమాచారం కోరుతూ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వందల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి రావడంతో రేవణ్ణ భారత్ నుంచి జర్మనీకి పారిపోయారు. డిప్లామాట్ పాస్‌పోర్టుపై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లారు. ఇప్పటికే అతన్ని భారత్‌కు తిరిగి రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
తాజాగా ‘బ్లూ కార్నర్ నోటీస్’ జారీ చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర ధృవీకరించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నారో సిట్ కనిపెడుతుందని, అనంతరం అతన్ని భారత్‌కు తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిట్‌కు సహకరిస్తాం. విచారణ పారదర్శకంగా జరుగుతుందని, ఈ వ్యవహారంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు’ ఆయన వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉండటంతో బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. సాధారణంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు. అయితే, బ్లూ కార్నర్ నోటీసులు అంటే.. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం. వ్యక్తి ఇతర దేశాలకు పారిపోయినప్పుడు అక్కడి పోలీసులకు సమాచారం వెల్లడించేందుకు ఈ నోటీసులు తప్పనిసరి. బ్లూ కార్నర్ నోటీసులు లేకుండా ఆ వివరాలు ఇచ్చేందుకు వీలవదు. బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా ప్రజ్వల్ రేవణ్ణ దర్యాప్తుకు, వివరాలు తెలుసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలో ఉండటంతో అతన్ని భారత్‌కు రప్పించే పనిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. లోక్ సభ ఎన్నికల వేళ ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఈ కేసులో చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…