Ratan Tata Death: రతన్‌టాటా మరణం.. “వీడ్కోలు స్నేహితుడా” అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్
Ratan Tata Death : నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్‌టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు.
వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటాది కూడా ఎంతోమందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కానీ, భారత్– చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.
అలనాటి సినీ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన సిమి గరేవాల్- రతన్‌టాటా మరణంపై స్పందించారు. “వాళ్లు నువ్వు వెళ్లిపోయావని అంటారు.. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. కొంతకాలం డేటింగ్ కూడా చేశారట. రతన్‌టాటా తన స్నేహితుడనీ 2011లో సిమి గరేవాల్ చెప్పారు.
They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV
— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..