AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meghalaya Honeymoon Murder: ఇంట్లో పనిచేసే ఐదేళ్లు చిన్నవాడితో ఎఫైర్ – హనీమూన్‌లో భర్తకు స్పాట్

పతీ పత్నీ.. ఔర్‌ వో. దీన్నే ఇంకోరకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అతడు. ఇండోర్‌కు చెందిన దంపతులు హనీమూన్‌కు వెళితే, భర్త శవమై తేలాడు. అయితే అతడి భార్యే హంతకురాలు. ఈ అంశం ఇప్పుడు సంచలనం రేపుతోంది. షిల్లాంగ్‌లో దంపతుల హనీమూన్‌‌కి వెళ్లి మిస్ అయిన కేసులో సంచలనం వెలుగుచూసింది.

Meghalaya Honeymoon Murder: ఇంట్లో పనిచేసే ఐదేళ్లు చిన్నవాడితో ఎఫైర్ - హనీమూన్‌లో భర్తకు స్పాట్
Sonam Raja Raghuvanshi
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2025 | 1:50 PM

Share

హనీమూన్‌ టూర్‌లో ఇండోర్‌వాసి రాజా రఘువంశీ హత్యకు సూత్రధారి భార్య సోనమేనని తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి.. షిల్లాంగ్‌లో హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. సోనమ్‌తో పాటు మధ్యప్రదేశ్‌కి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

భర్తతో పాటే ఆ నవవధువుని కూడా దుండగులు చంపేసి ఉంటారనుకున్నారు. ఆమె మృతదేహం కోసమే పోలీసులు వెతికారు. సోనమ్‌ని కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానించారు. సోనమ్‌ కోసం పోలీసులు షిల్లాంగ్‌ని జల్లెడపడుతుంటే.. తను యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.

మే11న రఘువంశీతో అట్టహాసంగా జరిగింది సోనమ్‌ పెళ్లి. మే 20న హనీమూన్‌ కోసం ఇండోర్‌ జంట మేఘాలయకు వచ్చింది. 23న ఆ జంట అదృశ్యమైతే 11రోజుల తర్వాత జూన్‌2న చిరపుంజి సమీపంలోని ఓ జలపాతం లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమైంది. స్పాట్‌లో కనిపించని సోనమ్‌.. 6 రోజుల తర్వాత యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తన జీవితంలోకి ఆహ్వానించిన భర్తకి హనీమూన్‌లో స్పాట్‌ పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆనందంగా పెళ్లి చేసుకుని ఉత్సాహంగా రఘువంశీతో హనీమూన్‌కి వచ్చిన సోనమ్‌ ఇంత ప్లాన్డ్‌గా అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ పెళ్లి ఆమెకు ఇష్టంలేదా? మరొకరితో ప్రేమలో ఉందా? పెళ్లిని తిరస్కరించే అవకాశముండీ.. హనీమూన్‌దాకా తీసుకొచ్చి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది. ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు రాబట్టారు పోలీసులు.

తమ దగ్గర పనిచేసే ఐదేళ్లు చిన్నవాడైన రాజ్‌ కుష్వాహాతో ఎఫైర్‌ పెట్టుకుంది సోనమ్‌. పెళ్లయ్యాక కూడా అతనితో సన్నిహితంగానే ఉంది. తమ బంధానికి మూడుముళ్ల బంధం అడ్డవుతుందని భావించింది. అందుకే హనీమూన్‌ పేరుతో భర్త అడ్డు తొలగించుకుంది. రాజా రఘువంశీ మర్డర్‌కి మాస్టర్‌మైండ్‌ రాజ్‌ కుష్వాహానే. విక్కీఠాకూర్‌, ఆనంద్‌ అతనికి సహకరించారు. షిల్లాంగ్‌లో వారు అపరిచితుల్లా కలిశారో, సోనమ్‌ పరిచయం చేసిందో తేలాల్సి ఉంది. కానీ భార్య కుట్ర తెలియని రఘువంశీ వారితో మాటలు కలిపాడు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్లాడు. ఎవరూలేని నిర్మానుష్య ప్రదేశంలో రఘువంశీని చంపేసి లోయలో పడేశారా దుర్మార్గులు.

మేఘాలయ హనీమూన్‌ ప్లానింగ్‌ సోనమ్‌దే. టికెట్లు కూడా తనే బుక్‌ చేయించింది. కానీ రిటన్‌ టికెట్‌ బుక్‌ చేయకపోవడాన్ని బట్టే హత్య కుట్రలో ఆమె పాత్ర కీలకమని పోలీసులకు అర్ధమైంది. ముగ్గురు నిందితులు దొరికిపోవటంతో ఒంటరైపోయింది సోనమ్‌. ఘాజీపూర్‌ చేరుకుని రాత్రి రెండుమూడుగంటలు ఓ డాబా దగ్గర ఉండిపోయింది. చివరికి పోలీసులకు లొంగిపోయింది.

నిందితుల కన్ఫెషన్‌తో సోనమ్‌ సుపారీతోనే మర్డర్‌ జరిగినట్లు పోలీసులు కన్‌ఫం చేసుకున్నారు. మేఘాలయ పోలీస్‌ టీమ్‌ ఘాజీపూర్‌కి చేరుకుంది. తన కూతురిపై అన్యాయంగా అభాండాలు మోపుతున్నారంటున్నాడు సోనమ్‌ తండ్రి దేవిసింగ్‌. కూతురిలా దగ్గరైన కోడలు తనకు కడుపుకోత మిగిలిస్తుందని అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతోంది రఘువంశీ తల్లి. సోనమ్ తన తల్లిదండ్రుల ఇంటి నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్లగా.. రాజా తన ఇంటి నుంచి రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు రింగ్, గొలుసు, బ్రాస్లెట్ వంటివి ధరించి బయలుదేరాడు. రాజా తల్లి అన్ని ఎందుకు అని ప్రశ్నించినప్పుడు… సోనమ్ వాటిని ధరించమని కోరినట్లు రాజా తన తల్లితో చెప్పాడట.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.