Mumbai Train Incident: కదులుతున్న ట్రైన్ నుంచి పడిపోయిన 10 మంది ప్రయాణికులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాథమిక సమాచారం ప్రకారం 10 నుండి 12 మంది ప్రయాణికులు పడిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి ప్రధాన కారణంగా ట్రైన్‌లో అధిక గందరగోళం పేర్కొనబడుతోంది. ప్రయాణికులు రైలు తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రైల్వే అధికారులు మరియు పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటనపై విచారణ ప్రారంభమైంది..

ముంబై, జూన్ 9: మహారాష్ట్రలోని ముంబ్రాలో సోమవారం (జూన్ 9) దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న లోకల్ రైలులో నుంచి 10 మందికి పైగా ప్రయాణికులు అమాంతం కింద పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. థానే జిల్లాలోని ముంబ్రా – దివా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న రైలులో రద్దీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పరిమితికిమించి ప్రయాణికులు రైలు ఎక్కడం వల్ల లోపల చోటులేకుండా ఫుట్‌బోర్డుపై అధిక మంది వేలాడుతూ ప్రయాణించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రెండు రైళ్లు వ్యతిరేక దిశల్లో ఒకదానికొకటి దాటుతుండగా.. పుడ్‌బోర్డుపై వేలాడుతున్న పది మంది పట్టుతప్పి కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రైలు ముంబ్రా స్టేషన్ గుండా వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రాసింగ్ సమయంలో పైకి క్రిందికి వెళ్ళే రెండు రైళ్ల ఫుట్‌బోర్డులపై నిలబడి ఉన్న ప్రయాణికులు ఢీకొనడం ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వ్యతిరేక దిశల్లో వెళ్లే రైళ్లలో ఫుట్ బోర్డు అంచున నిలబడిన ప్రయాణించే ప్రయాణికులు ఢీకొని బ్యాలెన్స్ కోల్పోయారని సెంట్రల్ రైల్వే సీపీఆర్‌ఓ స్వప్నిల్ ధన్‌రాజ్ నీలా తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని థానే సివిల్ హాస్పిటల్, కళ్యాణ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రైల్వే యంత్రాంగం ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదం కారణంగా పలు సెంట్రల్ రైల్వే స్థానిక రైలు సర్వీసులు రద్దయ్యాయి. ముంబ్రా-దివా విభాగంలో కార్యకలాపాలు కొంతకాలంగా నెమ్మదిగా ఉండటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యానికి గురవుతున్నారు. త్వరలోనే సేవలను పునరుద్ధరించడానికి రైల్వేలు చర్యలు చేపట్టింది. కాగా ప్రతిరోజూ 80 లక్షల మంది ప్రయాణికులు ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.