మోదీతో ఇంటర్వ్యూ.. అహ్మద్ పటేల్‌కు కోపం.. SP నుంచి బహిష్కరణ.. షాహిద్ సిద్ధిఖీ ఏం చెప్పారంటే..?
సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ రాసిన ఐ విట్నెస్ పుస్తకంలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీతో తన ఇంటర్వ్యూ, దాని వల్ల కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కోపం రావడం విషయాలను వివరించారు. ఈ ఇంటర్వ్యూ కారణంగా సమాజ్ వాదీ పార్టీ నుండి సిద్ధిఖీని బహిష్కరించారు.

ప్రముఖ జర్నలిస్ట్, మాజీ రాజ్యసభ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ పుస్తకం ఐ విట్నెస్’ పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ తనపై ఎందుకు కోపంగా ఉన్నారో.. ఆ కోపం చివరికి తనను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఎలా దారితీసిందో ఆయన వివరించారు. ఈ పుస్తకంలో, షాహిద్ సిద్ధిఖీ తన జర్నలిజం, రాజకీయ ప్రయాణం, రాజకీయ దిగ్గజాలతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన ఒక ముఖ్యమైన సంఘటన.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో ఆయన చేసిన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైన తర్వాత దేశవ్యాప్తంగా కలకలం రేగింది.
ఆ ఇంటర్వ్యూలో మోదీ .. ‘‘నా ప్రభుత్వం గోద్రా అల్లర్లు చేసి ఉంటే.. రాబోయే 100 ఏళ్ల ఎవరూ అలాంటి నేరం చేయడానికి ధైర్యం చేయని విధంగా నన్ను బహిరంగంగా ఉరితీయాలి’’ అని అన్నారు. ఈ వాఖ్య దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఇంటర్వ్యూ ప్రచురణకు ముందు అహ్మద్ పటేల్, షాహిద్ సిద్ధిఖీని కలిసి ఈ ఇంటర్వ్యూని ప్రచురించవద్దని కోరారు. అహ్మద్ పటేల్ తన వద్దకు వచ్చి మోదీ ఇంటర్వ్యూ గురించి అడిగారని, ఆ ఇంటర్వ్యూ ప్రచురించడం మంచిది కాదని అన్నారని సిద్ధిఖీ వెల్లడించారు. ‘‘ఈ ఇంటర్వ్యూ ప్రచురిస్తే మోదీకి ప్రయోజనం తప్ప నష్టం ఉండదు అని పటేల్ అన్నారు. ఈ సమయంలో నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూ ప్రచురిస్తే ఆ అవకాశం పోతుందని పటేల్ హెచ్చరించారు’’ అని సిద్ధిఖీ గుర్తుచేసుకున్నారు.
షాహిద్ సిద్ధిఖీ పటేల్ మాటలను పెడచెవిన పెట్టారు. ఇంటర్వ్యూ ప్రచురితమైన మూడు, నాలుగు రోజుల్లోనే అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే అన్ని టీవీ ఛానెళ్ళలో దానిపై చర్చలు మొదలయ్యాయి. కేవలం కొన్ని గంటల్లోనే షాహిద్ సిద్ధిఖీని సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన వృత్తి ధర్మాన్ని పాటించడం వల్ల ఆయనకు పదవి పోయినప్పటికీ, తన విశ్వసనీయతను నిలబెట్టుకున్నారని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




