AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 ఏళ్లుగా ఆసుపత్రికే వెళ్లలేదీ 102 ఏళ్ల బామ్మ..15 గంటల నిద్ర, వింత ఆహారపు అలవాట్లు

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన జిన్ బావోలింగ్ (102) ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. ఆమె ఫిజికల్ హెల్త్ చూసి గ్రామస్తులంతా ఆమెను ముద్దుగా 'ఓల్డ్ బేబీ' అని పిలుచుకుంటారు. గత 50 ఏళ్లలో ఆమె ఒక్కసారి కూడా ఆసుపత్రి గడప తొక్కలేదంటే ఆమె ఎంత ఆరోగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

50 ఏళ్లుగా ఆసుపత్రికే వెళ్లలేదీ 102 ఏళ్ల బామ్మ..15 గంటల నిద్ర, వింత ఆహారపు అలవాట్లు
102 Year Old Jin Baoling.jpg
Nikhil
|

Updated on: Mar 16, 2026 | 9:35 PM

Share

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో 60 ఏళ్లు దాటడమే గగనమైపోతోంది. అలాంటిది తూర్పు చైనాకు చెందిన ఒక బామ్మ ఏకంగా 102 ఏళ్లు పూర్తి చేసుకుని, ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వందేళ్లు దాటినా ఆమె కంటిచూపు చెక్కుచెదరలేదు, చేతుల్లో వణుకు లేదు. ఆ బామ్మ జీవనశైలి, ఆమె తీసుకునే ఆహారం గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో ‘ఓల్డ్ బేబీ’గా పిలవబడే ఈ శతాధిక వృద్ధురాలి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం..

నిద్రలోనే అసలు రహస్యం..

జిన్ బామ్మ దినచర్య చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె ఉదయం 9 గంటల వరకు నిద్ర లేవదు. రోజంతా అప్పుడప్పుడు చిన్న చిన్న కునుకులు తీస్తూ, రాత్రి 7 గంటలకల్లా పడక చేరుకుంటుంది. అంటే రోజుకు దాదాపు 15 గంటల పాటు ఆమె నిద్రపోతుందని ఆమె కుమారుడు తెలిపారు. ప్రశాంతమైన నిద్రే ఆమె మెదడును చురుగ్గా ఉంచుతోంది. సాధారణంగా వృద్ధులు తక్కువగా తింటారు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ జిన్ బామ్మ విషయంలో అంతా రివర్స్!

  • పిగ్ ట్రాటర్స్- ఆమెకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పంది కాళ్లతో చేసిన వంటకాన్ని రోజూ తింటుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
  • వెజిటబుల్స్ అంటే నో- ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె కూరగాయలను అస్సలు ముట్టుకోదు. రోజుకు మూడు నారింజ పండ్లు, రెండు గుడ్లు మాత్రం తప్పనిసరిగా తీసుకుంటుంది.
  • రైస్ వైన్- ప్రతి భోజనంతో పాటు కొద్దిగా రైస్ వైన్ తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో ఇంట్లోనే తయారు చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె వద్ద ఎప్పుడూ ఉంటుంది.

చురుకైన పనులు..

కాళ్ల నొప్పుల వల్ల నడవడానికి సాయం కావాల్సి వచ్చినప్పటికీ, ఆమె కంటిచూపు మాత్రం చాలా పదునుగా ఉంటుంది. వందేళ్లు దాటినా ఇప్పటికీ ఆమె తన సాక్సులను తానే కుట్టుకుంటుంది, పాత బూట్లను రిపేర్ చేస్తుంది. ఖాళీగా ఉండకుండా చేతులకు పని చెప్పడం ఆమెకు అలవాటు. “నా తల్లి ఆరోగ్యం వెనుక ఉన్న అసలైన రహస్యం ఆమె పాజిటివ్ ఆటిట్యూడ్” అని ఆమె కుమారుడు చెబుతారు.

ఆమె జీవితంలో ఎవరితోనూ వాదించలేదు, గొడవ పడలేదు. ఏ సమస్య వచ్చినా చాలా త్వరగా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ప్రేమగా ఉండటమే ఆమెకు తెలిసిన అతిపెద్ద సంపద. జిన్ బామ్మ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే.. ఆహారం ఏదైనా, మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఒత్తిడి లేని జీవితం గడిపితే వందేళ్లు ఆరోగ్యంగా బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు!

Follow Us