రక్షణ రంగంలో స్వావలంబన : క్రెడిట్ “నమో” దే !!

రక్షణ రంగంలో స్వావలంబన : క్రెడిట్ నమో దే !!

అంతరిక్ష పరిజ్ఞానం, అణ్వాయుధ సామర్థ్యంలో తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన భారత్ ఇప్పుడు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ తన సత్తా చాటుకుంటున్నది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో గగన విహారం చేయడం ద్వారా మన శాస్త్ర సాంకేతిక నిపుణుల, రక్షణ దళాల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నిపుణులు చెబుతున్న ప్రకారం-తేజస్ బహుళ పాత్రలు నిర్వహించే, ఎన్నో కీలక సాంకేతిక యుక్తులు పొందుపరిచిన తేలికపాటి […]

Rajesh Sharma

| Edited By:

Oct 16, 2019 | 4:53 PM

అంతరిక్ష పరిజ్ఞానం, అణ్వాయుధ సామర్థ్యంలో తమ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన భారత్ ఇప్పుడు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ తన సత్తా చాటుకుంటున్నది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో గగన విహారం చేయడం ద్వారా మన శాస్త్ర సాంకేతిక నిపుణుల, రక్షణ దళాల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. నిపుణులు చెబుతున్న ప్రకారం-తేజస్ బహుళ పాత్రలు నిర్వహించే, ఎన్నో కీలక సాంకేతిక యుక్తులు పొందుపరిచిన తేలికపాటి యుద్ధ విమానం. సునిశిత లక్ష్య ఛేదకశక్తి గలదిగా దీన్ని తీర్చిదిద్దారు. శత్రువు దాడికి అందనంత దూరంగా ఉండి, లక్ష్యంపై దాడులు చేయగల సామర్థ్యం గల యుద్ధ విమానంగా చెబుతున్నారు. మొదట నలభై తేజస్ యుద్ధ విమానాలు కోరిన వైమానిక దళం ఇప్పుడు మరో 83 కావాలంటున్నది. ఈ యుద్ధ విమానాలను చేర్చడం వల్ల వైమానిక దళం మరింత శక్తిమంతం అవుతుందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ తేజస్ విమానం వైమానిక దళ ఉపయోగం కోసం రూపొందించినది. నావికాదళం కోసం రూపొందించిన సరికొత్త నమూనా తేజస్ ప్రయోగాత్మకంగా గత శుక్రవారం గోవా దగ్గర విజయవంతంగా విమాన వాహక యుద్ధనౌకపై వాలింది. భూమిపై నుంచి కన్నా యుద్ధ నౌకపై నుంచి ఎగరడానికి, వాలడానికి అతి తక్కువ దూరంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుంది. గత ఏడాది నిర్వహించిన ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి కృషి ఫలించినందుకు హర్షం వ్యక్తమవుతున్నది. అయితే ఇంకా నావికా దళంలో ప్రవేశపెట్టడానికి అనేక ప్రయోగాలు చేయవలసి ఉంటుంది. 2021 నాటికి ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధ నౌక నిర్మా ణం పూర్తి అవుతుంది. ఈ యుద్ధనౌకపై తేజస్ విమానాలను మోహరిస్తారు.

తేజస్ వంటి తేలికపాటి యుద్ధ విమానం (light combat aircraft ) నిర్మించుకోవడం మనకున్న పరిస్థితుల్లో గొప్ప విషయమే అయినప్పటికీ, ప్రపంచ దేశాలతో పోటీ పడవలసినప్పుడు ఇంకా వెనుకబడి ఉన్నామనే మాట కూడా వినబడుతున్నది. నేటి తేజస్ యుద్ధ విమానాన్ని మరింత ఆధునీకరించి 2023 నాటికి ఎల్‌సీఏ మార్క్- 2ను రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. తేజస్ విమానాలు నాలుగవతరానికి చెందినవి. కానీ చైనా ఇప్పటికే ఐదవతరం తేలికపాటి యుద్ధ విమానాలను తయారీలో ఉన్నది. వీటిని ఎగుమతి కోసమే తయారు చేస్తున్నది. అంటే భారత్ తేజస్ కన్నా అధునాతన ఎల్‌సీఏలు పాకిస్థాన్‌కు అందే అవకాశాలున్నాయి. మరి భారత్ భారీ ఎత్తున ఎల్‌సీఏలను తయారుచేస్తే, కొన్ని దశాబ్దాల పాటు కాలం చెల్లినవాటితో సరిపెట్టుకోవలసి వస్తుంది. మళ్ళా మన దేశం ఐదవ తరం ఎల్‌సీఏలను తయారుచేసే నాటికి ఇతర దేశాలు ఆరవ తరం దగ్గర ఉంటాయి. అందువల్ల కనీసం యాభై ఏళ్ళ ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. మన సంస్థలు ఎల్‌సీఏ తయారు చేయడానికి దశాబ్దాలు పట్టింది. మనకున్న వనరులు, కాల పరిమితి దృష్ట్యా నాలుగవ తరం ఎల్‌సీఏలు ఆధునీకరిస్తూ పోతే, ఇక ఐదవతరం విమానాలను పక్కన పెట్టక తప్పదు. అందువల్ల తేజస్‌ను ఆధునీకరించే బదులు ఐదవతరంపై దృష్టి పెట్టడం మంచిదనే వాదన ముందుకు వస్తున్నది. ఎల్‌సీఏ విషయంలోనే కాదు, మొత్తం రక్షణ రంగంలో కొత్త కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన తరుణమిది.

ఆయుధాలు, యుద్ధ రీతులు అతివేగంగా మారుతూ ఉంటాయి. ఇటీవల సౌదీ అరేబియాపై హూతి తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడులు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణులను ఆలోచింపచేశాయి. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశాలు క్షిపణిదాడులను తిప్పికోట్టే రీతిలో రక్షణ కవచాలను నిర్మించుకున్నాయి. కానీ చిన్నస్థాయి డ్రోన్‌ల గుంపు రాడార్లు పసిగట్టకుండా మిడతల దండులా వచ్చి పడటం ఇటీవలి కాలపు పోకడ. ఒక డజను డ్రోన్ల ధర లక్షన్నర డాలర్లకు మించదు. వీటితో ప్రపంచంలోని అతి పెద్ద శుద్ధి కేంద్రం, సౌదీలోని రెండవ అతి పెద్ద చమురు క్షేత్రం ధ్వంసం అయ్యాయి. హూతీ తిరుగుబాటుదారుల స్థాయి కన్నా చిన్న ముఠా పెద్ద దేశాన్ని దెబ్బకొట్టవచ్చు. ఇప్పటికే సిరియా మొదలుకొని ఆఫ్ఘనిస్థాన్ వరకు డ్రోన్ల వాడకం పెరిగింది. భవిష్యత్తులో దాడులు భారీ ఆయుధాలతో కాకుండా చౌకగా తయారయ్యే చిన్న ఆయుధ వ్యవస్థలతో సాగవచ్చు. శత్రువు కనిపించకుండా, తమ కీలుబొమ్మల ద్వారా యుద్ధానికి దిగవచ్చు. సైబర్ స్పేస్ కేంద్రంగా కూడా దాడులు సాగుతాయి. భవిష్యత్తులో ఆయుధాలు, రక్షణ విధానాలు పూర్తిగా మార్పునకు లోనుకావచ్చు. హూతీలు ఇరాన్ నుంచి సౌదీ అరేబియా చైనా నుంచి డ్రోన్లను తెచ్చుకొని పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో ఆయుధాలు అమ్మేవారు, కొనే దేశాలూ ముఠాలు ఉంటాయి. భారత్ వర్ధమాన ఆర్థిక వ్యవస్థ కనుక తన వనరులను అత్యంత పొదుపుగా, ఉపయోగకరంగా వాడుకోవాలె. 21వ శతాబ్దపు యుద్ధరీతులకు అనుగుణంగా ఆయుధ, రక్షణ వ్యవస్థలను రూపొందించుకోవాలె. ఇందుకు శాస్త్ర సాంకేతిక రంగాలలో సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దిశగా మోడీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులకు మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇపుడిపుడే అవి ఫలితాలనిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధార పది మన సైనిక సామర్త్యాన్ని పెంచుకుని పరిస్థితి నుంచి మనకు మనమే రక్షణ సౌకర్యాలను, ఆయుధాలను, ప్రయాణ వాహనాలను తయారు చేసుకునే స్థాయికి చేరుకోవడం నిజంగా ఆనందించ దాగిన విషయమే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu