Lok Sabha Election 2024: రెండవ విడతలో రాహుల్ గాంధీ భవితవ్యం.. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే!!

| Edited By: Srikar T

Apr 21, 2024 | 12:22 PM

సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నమోదైన తక్కువ పోలింగ్ శాతంపై విశ్లేషణలు ఓవైపు జరుగుతున్నాయి. మరోవైపు రెండవ విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు, నేతలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. విపక్ష కూటమి (I.N.D.I.A) అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ భవిష్యత్తును తేల్చేది కూడా 2వ విడత పోలింగ్.

Lok Sabha Election 2024: రెండవ విడతలో రాహుల్ గాంధీ భవితవ్యం.. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే!!
Rahul Gandhi
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నమోదైన తక్కువ పోలింగ్ శాతంపై విశ్లేషణలు ఓవైపు జరుగుతున్నాయి. మరోవైపు రెండవ విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు, నేతలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. విపక్ష కూటమి (I.N.D.I.A) అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ భవిష్యత్తును తేల్చేది కూడా 2వ విడత పోలింగ్. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 102 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగ్గా.. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. రెండో విడతలో దేశంలోని 12 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో దక్షిణాదిన కేరళలోని అన్ని నియోజకవర్గాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, అస్సాం, బీహార్, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలున్నాయి. కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీతో పాటు అదే స్థానంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) తరఫున బరిలో నిలిచిన ఏ. రాజా సతీమణి అన్నీ రాజా కూడా ఉన్నారు. అలాగే శశి థరూర్‌, నవనీత్‌ రాణా, ఓం బిర్లా, హేమమాలిని, అరుణ్‌ గోవిల్‌, ప్రహ్లాద్‌ జోషి వంటి ప్రముఖ అభ్యర్థులు రెండో విడత బరిలో ఉన్నారు.

ఎన్నికల తేదీలు ప్రకటించిన సమయంలో రెండవ దశలో దేశవ్యాప్తంగా 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భల్వి మరణించినందున ఇక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఈ కారణంగా రెండో విడతలో 88 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

ఏ రాష్ట్రంలో ఏయే స్థానాలు:

  • అస్సాం: కరీంగంజ్, సిల్చార్, మంగళ్దోయ్, నాగాన్, కలియాబోర్
  • బీహార్: కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్
  • ఛత్తీస్‌గఢ్: మహాసముంద్, కంకేర్, రాజ్‌నంద్‌గావ్
  • కర్ణాటక: బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా, చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్.
  • కేరళ: అలప్పుజ, మావెలిక్కర, పతనంతిట్ట, కొల్లాం, అట్టింగల్, తిరువనంతపురం, కాసరగోడ్, కన్నూర్, వడకర, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం.
  • మధ్యప్రదేశ్: దామోహ్, ఖజురహో, సత్నా, తికమ్‌ఘర్, రేవా, హోషంగాబాద్
  • మహారాష్ట్ర: బుల్దానా, అకోలా, యవత్మాల్ వాషిమ్, హింగోలి, నాందేడ్, పర్భాని, అమరావతి, వార్ధా
  • మణిపూర్: ఔటర్ మణిపూర్
  • రాజస్థాన్: బార్మర్, జలోర్, ఉదయపూర్, బన్స్వారా, చిత్తోర్‌ఘర్, టోంక్-సవాయి మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట మరియు ఝలావర్-బరన్.

2వ విడత బరిలో ఉన్న ప్రముఖులు:

రాహుల్ గాంధీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రెండో పర్యాయం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై సీపీఐ తరఫున అన్నీ రాజా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే. సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మిగతా అన్ని రాష్ట్రాల్లో విపక్ష కూటమిలో భాగంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తుండగా.. కేరళలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా కత్తులు దూస్తున్నాయి. మరోవైపు ఈ రాష్ట్రంలో బలపడేందుకు కమలనాథులు సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈ నియోజకవర్గానికి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రాహుల్ పోటీ చేస్తున్న వాయనాడ్‌లో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

శశిథరూర్:

కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మళ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనపై బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా.. వామపక్షాల నుంచి పనియన్ రవీంద్రన్‌ పోటీ చేస్తున్నారు. మాజీ దౌత్యవేత్త శశిథరూర్, టెక్నోక్రాట్ రాజీవ్ చంద్రశేఖర్ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి.

నవనీత్ రాణా:

కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నవనీత్ రాణా మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివసేన అభ్యర్థి ఆనంద్‌రావు అడ్సుల్‌పై గెలుపొందారు. ఈసారి ఆమె బీజేపీ తరఫున బరిలోకి దిగగా… మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పడ్డ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కూడిన కూటమి కాంగ్రెస్ నేత బల్వంత్ బస్వంత్ వాంఖడేను బరిలోకి దించింది. అయితే ఇక్కడ డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గం యావద్దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది.

ఓం బిర్లా:

రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మళ్లీ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనపై కాంగ్రెస్ ప్రహ్లాద్ గుంజాల్‌ను రంగంలోకి దింపింది. వరుసగా రెండు పర్యాయాలు 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందుతూ వచ్చిన ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రతిసారీ అభ్యర్థిని మార్చుతూ ప్రయోగాలు చేసింది. ఈసారి ప్రహ్లాద్ గుంజాల్‌ను బరిలోకి దించింది.

మహేశ్ శర్మ:

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్ శర్మపై సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహేంద్ర సింగ్ నాగర్, బీఎస్పీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ సోలంకి పోటీ చేస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా టౌన్‌షిప్ మొత్తం ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. మహేశ్ శర్మ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు. ద్వితీయ స్థానంలో సమాజ్‌వాదీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కు చెందిన అభ్యర్థులే నిలవగా.. కాంగ్రెస్ కనీసం 4 శాతం ఓట్లను కూడా పొందలేకపోయింది. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టి పోటీ చేసినా.. మహేశ్ శర్మ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. పైగా 2014 కంటే 2019లో ఆయన మెజారిటీ మరింత పెరిగింది.

హేమమాలిని:

మధుర లోక్‌సభ స్థానం నుంచి నటి, సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధంగర్ పోటీ చేస్తున్నారు. ఆమె 2014లో 5.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2019లో అది 2.93 లక్షలకు తగ్గింది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాట్ల మద్దతు పుష్కలంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) ఇప్పుడు ఎన్డీఏ గూటిలో చేరినందున.. ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది.

అరుణ్ గోవిల్:

మీరట్ లోక్‌సభ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సునీతా వర్మతో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తలపడుతున్నారు. ఒకప్పుడు యావద్దేశాన్ని అలరించిన రామాయణం టీవీ సీరియల్‌లో శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ దేశ ప్రజలందరికీ సుపరిచితుడు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సమయంలో ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అరుణ్ గోవిల్‌ను బీజేపీ తొలిసారిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరట్ టికెట్ అప్పగించింది. ఇక్కడ వరుసగా 2 పర్యాయాలు గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్‌ను పక్కనపెట్టి మరీ అరుణ్ గోవిల్‌కు టికెట్ ఇవ్వడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. 2014లో 2.32 లక్షల మెజారిటీతో గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్, 2019లో అతి కష్టమ్మీద 4,729 ఓట్ల తేడాతో గట్టెక్కారు. అందుకే దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టిన బీజేపీ, మీరట్ నియోజకవర్గాన్ని కూడా ఆ జాబితాలో చేర్చింది.

ప్రహ్లాద్ జోషి:

కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మరోసారి బరిలోకి దిగారు. ఆయన 2004 నుంచి వరుసగా 4 పర్యాయాలు గెలుపొందుతూ వచ్చారు. ఐదోసారి గెలుపొందాలని చూస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ వినోద్ అసూటిని బరిలోకి దించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినోద్ సన్నిహితుడు. నియోజకవర్గంలో కురుబ సామాజికవర్గం జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది. సిద్ధరామయ్య, వినోద్ ఇద్దరూ ఇదే వర్గానికి చెందిన నేతలు. బ్రాహ్మణ నేత ప్రహ్లాద్ జోషికి రాజకీయ సమీకరణాలతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.