Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుసగా ఒక్కొక్క పార్టీలు కూటమిని వీడుతుండటం.. పలు పార్టీలు సీట్లపై తేల్చిచెప్పాలని నిలదీస్తుండటంతో కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే.. కూటమిలోని కీలక నేత నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జత కట్టగా.. సీట్ల విషయంలో విబేధాలు తలెత్తడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ లో కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వబోమని ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టంచేశారు. అంతేకాకుండా.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. కశ్మీర్‌లో తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా కాంగ్రెస్ తో అంటిముట్టకుండానే వ్యవహరిస్తూ ఒక్కోచోట అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది.. పంజాబ్‌లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో కూటమితో సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. తాజాగా.. సంచలన వ్యాఖ్యలు చేసి ఇండియా కూటమిని మరోసారి ఇరకాటంలో పడేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో సమాజ్‌వాదీ పార్టీ చేరడంపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకం జరిగితేనే యాత్రలో పాల్గొంటానని తేల్చి చెప్పారు. సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదని.. ఖరారు అయితేనే పార్టీ చేపట్టిన యాత్రలో పాల్గొంటానని తెలిపారు.
సోమవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. పొత్తుకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, తమకు జాబితా అందిందని తెలిపారు. ఎంపీ సీట్లకు సంబంధించిన జాబితా కూడా ఇచ్చామని చెప్పారు. సీట్ల పంపకం ముగిసిన వెంటనే సమాజ్ వాదీ పార్టీ తమ న్యాయ యాత్రలో చేరుతుందని స్పష్టంచేశారు.
కాగా.. అంతకుముందు అఖిలేష్ యాదవ్.. యూపీలోని 80 పార్లమెంట్ స్థానాల్లో 15 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.. దీనిపై కాంగ్రెస్ నిర్ణయం తర్వాత.. తాను ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా.. ఇండియా కూటమిలో.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరులా పరిస్థితి మారిపోయింది.. కీలక పార్టీలన్నీ షాకిస్తుండటంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా.. అన్న సందేహాలు కూడా కలుగుతుండటం.. చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..