మహారాష్ట్రలో ముదురుతోన్న వివాదం, గవర్నర్‌ వర్సెస్ శివసేన సర్కార్‌, కక్షపూరిత చర్యలంటోన్న బీజేపీ

గవర్నర్‌ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. విమానం ఎక్కారు. ఇంకాసేపట్లో గాల్లోకి లేవాల్సిన విమానం అనుమతి లేక కదల్లేదు. పర్మిషన్‌ లేదనటంతో మరో మార్గం లేక వేరే విమానమెక్కారు..

మహారాష్ట్రలో ముదురుతోన్న వివాదం,  గవర్నర్‌ వర్సెస్ శివసేన సర్కార్‌, కక్షపూరిత చర్యలంటోన్న బీజేపీ
Follow us

|

Updated on: Feb 11, 2021 | 9:09 PM

గవర్నర్‌ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. విమానం ఎక్కారు. ఇంకాసేపట్లో గాల్లోకి లేవాల్సిన విమానం అనుమతి లేక కదల్లేదు. పర్మిషన్‌ లేదనటంతో మరో మార్గం లేక వేరే విమానమెక్కారు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారి. రాష్ట్రప్రభుత్వంతో గవర్నర్‌కు గ్యాప్‌ పెరుగుతున్న టైంలో.. మరింత మంట రాజేసిందీ వివాదం. ఎన్నికల ముందే బీజేపీ-శివసేన మధ్య తెగదెంపులయ్యాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రెండుపార్టీల మధ్య తరచూ మాటలయుద్ధం జరుగుతోంది. ఆటోమేటిక్‌గా గవర్నర్‌తో కూడా.. ఉద్ధవ్‌ సర్కార్‌కి గ్యాప్‌ పెరిగిపోయింది. తాజాగా గవర్నర్ కోశ్యారి ఫ్లైట్‌ జర్నీకి ఎర్రజెండా ఊపింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరద జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు డెహ్రాడూన్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారి. ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లిన గవర్నర్‌ రెండుగంటలపాటు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తీరా ప్రభుత్వ విమానంలో కూర్చున్న పావుగంట తర్వాత…టేకాఫ్‌కు అనుమ‌తి రాలేద‌ని కెప్టెన్‌ చెప్పటంతో…చేసేదేం లేక మ‌రో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు గవర్నర్‌.

వారంక్రితమే గవర్నర్‌ టూర్‌ గురించి ప్రభుత్వానికి తెలిపింది రాజ్‌భవన్‌. అయినా ఆయనకు పర్మిషన్‌ ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తంచేసింది. అయితే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదన్నారు శివసేన ఎంపీ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం… సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఇతరులు ఎవరు వాడాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే గవర్నర్‌కు అనుమతి లభించలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

అయితే కక్షపూరితంగానే గవర్నర్‌కు ప్రభుత్వం విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌. కొన్నాళ్లుగా గవర్నర్‌తో ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వానికి కొన్ని అంశాలపై వివాదం నడుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మహారాష్ట్రలో ఆలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని గవర్నర్‌ ప్రశ్నించారు. దీనిపై సీఎం, గవర్నర్‌ మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు గవర్నర్‌ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించడంతో వివాదం మరింత జఠిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read also : నిమ్మగడ్డ మరో బాంబు, మున్సిపల్ ఎన్నికలకూ త్వరలోనే ముహూర్తం, పంచాయతీల పోలింగ్ ముగిసేలోపే నోటిఫికేషన్.!