Receptionist Murder: తప్పిపోయిన మైనర్ రిసెప్షనిస్ట్ మృతదేహం బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్ ప్రాంగణంలో లభ్యమైంది. హత్య కేసులో పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు పోలీసులు. వ్యక్తిగత వివాదంతో ఆమెను రిసార్ట్ సమీపంలోని నీటి కాలువలోకి తోసినట్లు నిందితులు అంగీకరించారు. ఆ తర్వాత ఆమె నీటిలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపారు. శనివారం ఉదయం చిల్లా పవర్ హౌస్ సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్)తో పాటు రాష్ట్ర యంత్రాంగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న మైనర్ బాలిక సెప్టెంబర్ 18న కనిపించకుండా పోయింది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గద్వాల్‌లోని తన ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న మైనర్ బాలికను హత్యచేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే బిజెపి సీనియర్ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు. అదృశ్యమైన బాధితురాలి మృతదేహం రిసార్ట్ సమీపంలోనే లభ్యమైంది. పుల్కిత్ ఆర్య తన ఇద్దరు గార్డులతో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు పుల్కిత్ ఆర్య, బాలిక కుటుంబ సభ్యులు స్థానిక రెవెన్యూ అధికారికి మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరభ్ భాస్కర్‌గా గుర్తించారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని రిసెప్షనిస్ట్ హత్య కేసులో చిక్కుకున్న బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన వనతార రిసార్ట్ ధ్వంసం చేశారు ఆగ్రహించిన స్థానికులు. జరిగిన ఘటనపై గ్రామస్తులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధామి రిసార్ట్‌ను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి