Panjab High Court: ఫోన్ రికార్డింగ్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే.. వాటిని పరిగణలోకి తీసుకోలేం..
రోజువారీగా భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు పరిగణలోకి తీసుకోలేమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది...
రోజువారీగా భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు పరిగణలోకి తీసుకోలేమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. కుటుంబ న్యాయస్థాన చట్టంలోని సెక్షన్ 13 కింద పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేమని చెప్పింది. భార్య టెలిఫోనిక్ సంభాషణను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేయడాన్ని ఆమె గోప్యతకు భంగం కలిగించడమేనని పేర్కొంది. 2020లో బటిండా కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లీసా గిల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బటిండా కుటుంబ న్యాయస్థానం ఆ మహిళ, విడిపోయిన భర్తకు మధ్య రికార్డ్ చేసిన సంభాషణలకు సంబంధించిన సీడీని నిరూపించడానికి అనుమతించింది. భార్యకు తెలియకుండా టెలిఫోనిక్ సంభాషణను రికార్డ్ చేయడం ఆమె గోప్యతను ఉల్లంఘించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా సంభాషణలు ఏ పరిస్థితులలో జరిగాయో నిర్ధారించలేమని చెప్పింది. ఎందుకంటే ఈ సంభాషణలు రహస్యంగా రికార్డ్ చేశారని స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. ఆ మహిళ నుంచి విడాకులు కోరుతూ భర్త 2017లో పిటిషన్ దాఖలు చేశాడు. వారి వివాహం 2009 లో ఘనంగా జరిగింది. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో భర్త తన సప్లిమెంటరీ అఫిడవిట్‌ను ఎగ్జామినేషన్-ఇన్-చీఫ్ ద్వారా సమర్పించడానికి అనుమతి కోరుతూ జులై, 2019లో మొబైల్ ఫోన్‌లోని మెమరీ కార్డ్ లేదా చిప్‌లో రికార్డ్ చేసిన సంభాషణల CD సమర్పించడానికి అనుమతి కోరాడు.
2020లో కుటుంబ న్యాయస్థానం సీడీని సమర్పించాడనికి అనుమతి ఇచ్చింది. దీంతో భార్య హైకోర్టును ఆశ్రయించింది. భార్య తరపు న్యాయవాది వాదిస్తూ CD భార్య గోప్యతకు భంగం వాటిల్లడమేనని కోర్టుకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘన అని చెప్పారు. భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 65కి కుటుంబ న్యాయస్థానం పూర్తిగా వీడ్కోలు పలికిందని, మొబైల్ ఫోన్ ద్వారా రికార్డింగ్‌లు చేస్తే, రికార్డింగ్‌కు సంబంధించిన సీడీలను సాక్ష్యంగా అంగీకరించలేమని న్యాయవాది వాదించారు.
Read Also.. Crime News: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్త.. భార్య చేసిన పనికి చావుబతుకుల్లో భర్త!