Free Power: పంజాబ్‌లో ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆప్ సర్కారు సంచలన నిర్ణయం
Free power in Punjab: పంజాబ్ అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సర్కారు నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆప్ సర్కారు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు.
Free power in Punjab: పంజాబ్ అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సర్కారు నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆప్ సర్కారు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జులై 1 తేదీ నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సీఎం భగవత్ మాన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆప్ చీఫ్, సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పార్టీ అధికారాన్ని చేపట్టి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ఆప్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ కీలక హామీని నెరవేర్చుతూ పంజాబ్ ప్రజలకు ఆప్ పెను ఊరట కలిగించింది. ఢిల్లీలోనూ ఆప్ సర్కారు ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది.
ప్రతి ఇంటికి రేషన్ సరకులను డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల పంజాబ్ సీఎం భగవత్ మాన్ ప్రకటించారు. ఇది కూడా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 25వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మార్చి 19న జరిగిన కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయించారు.
గత నెల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్‌వాది పార్టీ కూటమి, బీజేపీ – పంజాబ్ లోక్ కాంగ్రెస్-ఎస్ఏడీ(ఎస్) కూటములను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. మొత్తం 117 మంది సభ్యులతో కూడిన పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించగా.. అధికార కాంగ్రెస్ 18 స్థానాలకు పరిమితమయ్యింది.
Also Read..
Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన ‘బీస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?