
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ‘డాక్టర్’ అని పిలువబడే హమ్జా బుర్హాన్ ముజఫరాబాద్‌లో దాడికి గురైన తర్వాత అనేక బుల్లెట్ గాయాలపాలయ్యాడు. ఈ గాయాలతో వెంటనే మరణించాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బుర్హాన్.. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన 2019 పుల్వామా దాడి సూత్రధారులలో ఒకడుగా ఉన్నాడు. పూల్వామా దాడికి ఇతడే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. పుల్వామా నివాసి అయిన బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. ఇతడిని 2022లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కాల్పులు జరగ్గా.. దాడి ఎవరు పాల్పడ్డారు..? హత్య వెనుక ఎవరు ఉన్నారు? అనే వివరాలు అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. అధికారులు పూర్తి వివరాలను త్వరలో బయటపెట్టే అవకాశముంది.
నిఘా సంస్థల నివేదిక ప్రకారం బుర్హాన్‌కు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల సుదీర్ఘ చరిత్ర ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు నెట్టడానికి అతనే బాధ్యుడు అని తెలుస్తోంది. అతను వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని రత్నిపోరా ప్రాంతానికి చెందినవాడు అని సమాచారం. ఏడు సంవత్సరాల క్రితం చెల్లుబాటు అయ్యే పత్రాలను ఉపయోగించి పాకిస్థాన్‌ను సందర్శించాడు. అక్కడికి వెళ్లి అల్-బదర్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు ఆపరేషనల్ కమాండర్‌గా మారాడు. దాని కోసం మిలిటెంట్లను నియమించే బాధ్యతను చేపట్టాడు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌లో ఆ సంస్థకు ఆయుధాల సరఫరా కోసం కూడా అన్వేషించినట్లు తెలుస్తోంది.