AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన ‘ఎడపాడి’ కోట.. షణ్ముగం కొత్త స్కెచ్!

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ద్రావిడ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అన్నాడీఎంకే (AIADMK) కోటలు కూలిపోవడం, థలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి (EPS) రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. "కర్మ రిటర్న్స్" అంటూ తాజా రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

విజయ్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన 'ఎడపాడి' కోట.. షణ్ముగం కొత్త స్కెచ్!
Eps, Cm Vijay
Ch Murali
| Edited By: |

Updated on: May 21, 2026 | 1:23 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ద్రావిడ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అన్నాడీఎంకే (AIADMK) కోటలు కూలిపోవడం, థలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి (EPS) రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. “కర్మ రిటర్న్స్” అంటూ తాజా రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఐదు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన అన్నాడీఎంకే ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి పోరాడుతోంది. ఎంజీఆర్ స్థాపించి, జయలలిత ప్రాణం పోసిన ఈ పార్టీ, ఇప్పుడు ముక్కలయ్యే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న పళనిస్వామికి ఇప్పుడు సొంత పార్టీ నేతలే చెక్ పెడుతున్నారు. 2017లో శశికళ జైలుకు వెళ్లే ముందు పళనిస్వామిని నమ్మి సీఎం పీఠం అప్పగిస్తే, ఆయన ఆమెకే వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్నారనే విమర్శ అప్పట్లోనే ఉంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో పళనిస్వామిని పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

2026 ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమై, మూడో స్థానానికి పడిపోవడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం. ఒంటెద్దు పోకడలు: బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవడం, సీనియర్ నేతల అభిప్రాయాలను గౌరవించకపోవడం వంటి అంశాలు ఈపీఎస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. జయలలిత నమ్మిన బంటుగా, పార్టీ వ్యూహకర్తగా పేరున్న సి.వి. షణ్ముగం ఇప్పుడు పళనిస్వామిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గతంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య జరిగిన పోరులో కీలక పాత్ర పోషించిన షణ్ముగం, ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు.

విజయ్ స్థాపించిన టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో, ఆ పార్టీకి మద్దతు తెలపాలని షణ్ముగం వర్గం నిర్ణయించుకుంది. ఇది అన్నాడీఎంకే కేడర్‌ను విస్మయానికి గురిచేస్తోంది. విజయ్ స్పష్టమైన విజయం, ఆయనకున్న ప్రజాదరణను గుర్తించి, ఆయనతో కలిసి నడవడమే సరైన మార్గమని ఈ రెబల్ నేతలు భావిస్తున్నారు.

పళనిస్వామి చేసిన అతిపెద్ద తప్పు బీజేపీతో విభేదించడమేనని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై పట్ల వ్యక్తిగత ద్వేషంతో, ఆయనను ఆ పదవి నుంచి తప్పించేలా ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం రివర్స్ అయింది. దీనివల్ల అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు చీలిపోవడమే కాకుండా, కేంద్రం మద్దతు కూడా కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకప్పుడు అమ్మ జయలలిత కనుసైగలతో నడిచిన పార్టీ, ఇప్పుడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పళనిస్వామిని పదవి నుంచి తొలగించి, కొత్త వారిని పార్టీ చీఫ్‌గా ఎన్నుకునే ప్రక్రియ వేగవంతమైంది. “శశికళను పార్టీ నుంచి ఎలాగైతే గెంటేశారో, ఇప్పుడు పళనిస్వామికి కూడా అదే గతి పడుతుంది. ఇది ప్రకృతి ఇచ్చిన తీర్పు” అని ప్రత్యర్థి వర్గం వ్యాఖ్యానిస్తోంది.

ప్రస్తుతం ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఎమ్మెల్యేలు టీవీకే వైపు లేదా షణ్ముగం వైపు మొగ్గు చూపుతుండటంతో, అన్నాడీఎంకే శాసనసభ పక్షం టీవీకేలో విలీనమయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఒకవేళ ఇదే జరిగితే, ఎంజీఆర్ కన్న కలలు, జయలలిత నిర్మించిన సామ్రాజ్యం చరిత్ర పుటల్లో కలిసిపోక తప్పదు.చివరగా.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనడానికి పళనిస్వామి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. రాజకీయ చదరంగంలో నాడు తను వేసిన ఎత్తులే, నేడు ఆయనపై చిత్తుగా మారుతున్నాయి. అన్నాడీఎంకే భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us