AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

౩ ఏళ్ల చిన్నారికి కొత్త జీవితం.. అరుదైన శస్త్రచికిత్స ఉచితంగా చేసిన వైద్యులు! ఎక్కడంటే..

పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో శస్త్రచికిత్స పొందిన తర్వాత తీవ్రమైన శ్వాస సమస్యతో జీవన్మరణ పోరాటం సాగిస్తున్న మూడున్నరేళ్ల బాలికకు వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ మధుసూదన్‌ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. పూర్తిగా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా పునర్నిర్మించి, అరుదైన శస్త్రచికిత్సను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. వైద్య చరిత్రలోనే ఇదో అరుదైన ఆపరేషన్‌ అని వైద్యులు తెలిపారు..

౩ ఏళ్ల చిన్నారికి కొత్త జీవితం.. అరుదైన శస్త్రచికిత్స ఉచితంగా చేసిన వైద్యులు! ఎక్కడంటే..
Sri Madhusudan Sai Institute Of Medical Sciences Performs Rare Surgery
Srilakshmi C
|

Updated on: May 21, 2026 | 12:47 PM

Share

ముద్దెనహಳ್ಳಿ, మే 21: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలిక శివాంగి శర్మకు 2025లో గుండె శస్త్రచికిత్స శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిలో నిర్వహించారు. అయితే శస్త్ర చికిత్సతో ఆ సమస్య నుంచీ బయటపడిందనుకుంటే ఆ తర్వాత మరో కొత్త సమస్య మొదలయ్యింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చాలా రోజుల పాటు శ్వాసనాళ ట్యూబ్‌ని అమర్చాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ‘సబ్‌గ్లోటిక్ స్టెనోసిస్‌’ (శ్వాసనాళం కుంచించుకొని దాదాపు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి) అనే తీవ్రమైన సమస్య ఏర్పడింది. దీంతో బాలికకు శ్వాస తీసుకోవడమే కష్టమైపోయింది. చికిత్స కోసం ఛత్తీస్‌గఢ్ ఎయిమ్స్‌ సహా అనేక ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ, కేసు క్లిష్టత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సకు వెనుకంజ వేశారు. ప్రైవేటు ఆస్పత్రులలో 30 నుంచీ 40 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఆ కుటుంబానికి దిక్కు తోచలేదు.

చివరి ప్రయత్నంగా బాలికను ముద్దేనహళ్ళిలోని శ్రీ మధుసూదన సాయి మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఇక్కడి చెవి, ముక్కు, గొంతు విభాగాధిపతి డాక్టర్‌ కుల భూషణ్‌ బాలి నేతృత్వంలో నిపుణులైన వైద్య బృందం ఈ సవాల్‌ను స్వీకరించి దశలవారీగా చికిత్స అందించింది. లేజర్‌, కోబ్లేషన్‌, బెలూన్ డైలేషన్‌, స్టెంట్ అమరిక వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్వాసనాళాన్ని పునర్నిర్మించారు. మే 11న స్టంట్‌ను తొలగించగా, అనంతరం దశలవారీ చికిత్స ద్వారా చివరకు మే 18న ట్రేకియోస్టమీ ట్యూబ్‌ను పూర్తిగా తొలగించారు. దీంతో బాలిక ఇప్పుడు సహజంగా శ్వాస తీసుకోవడంతో పాటు మాట్లాడగలుగుతోంది. ఈ సందర్భంగా బాలిక తండ్రి గౌరవ్ శర్మ మాట్లాడుతూ.. ‘ముద్దేనహಳ್ಳಿ ఆసుపత్రి ఒక దేవాలయం లాంటిది. ఇతర ఆసుపత్రుల్లో లభించని వైద్య సదుపాయాలు, ప్రేమాభిమానాలు ఇక్కడ అందిస్తున్నారు. నా కుమార్తెకు కొత్త జీవితం ఇచ్చిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా వంటి పేద కుటుంబాలకు ఇది ఆశాకిరణం’ అని అన్నారు.

బాలికలో పూర్తిగా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని ఎండోస్కోపిక్ సాంకేతికతతో పునర్నిర్మించడం అత్యంత అరుదైన విజయమని, ఈ బాలికకు అత్యంత క్లిష్టమైన ఐదు శస్త్రచికిత్సలు నిర్వహించామని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కుల్‌ భూషణ్‌ బాలి తెలిపారు. ప్రపంచంలో కొద్ది ఆసుపత్రులకే ఇలాంటి క్లిష్ట శస్త్రచికిత్సలను నిర్వహించే నైపుణ్యం, సదుపాయాలు ఉన్నాయని, వాటిలో కూడా విజయశాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ చిన్నారికి తాము పునర్జన్మ ఇచ్చినందుకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర-కర్నాటక సరిహద్దుల్లో సద్గురు శ్రీ మధుసూదన్‌ సాయి నేతృత్వంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌కి విద్య, వైద్యం, పోషకహార రంగాలలో ఉచిత సేవలందించడంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానం ఉంది. ఈ మిషన్‌ ఆధ్వర్యంలో 100 దేశాల్లో సేవలందిస్తున్నారు. మన దేశంలో ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన్‌ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తో పాటు దేశ వ్యాప్తంగా శ్రీ సత్య సాయి సంజీవనీ ఆస్పత్రులలో గత 13 ఏళ్లలో లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలందించింది. శ్రీ సత్యసాయి లోక సేవా గురుకులం, శ్రీ సత్య సాయి యూనివర్శిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచీ పీహెచ్‌డీ వరకు ఉచిత విద్యను అందిస్తోంది. అలాగే ఎంబీబీఎస్‌ సహా వైద్య విద్యలో పీజీ కోర్సులను కూడా పూర్తి ఉచితంగా అందించే ఏకైక సంస్థ వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇక పోషకాహార విషయంలో రోజూ కోటి మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉదయాన్నే సాయి ష్యూర్‌ పేరుతో ఉచితంగా పోషకాహార పానీయాన్ని అందిస్తోంది.

Follow Us