AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. కేవలం 48 గంటల్లోనే 66 లక్షల ఇన్‌స్టా ఫాలోవర్లు!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది? ఇంత హఠాత్తుగా దేశ నిరుద్యోగ యువత మాత్రమే ఎందుకు ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఈ పార్టీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధం ఏమిటి వంటి పూర్తి కథాకమా మీషు మీకోసం..

పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'.. కేవలం 48 గంటల్లోనే 66 లక్షల ఇన్‌స్టా ఫాలోవర్లు!
Cockroach Janta Party
Srilakshmi C
|

Updated on: May 21, 2026 | 11:12 AM

Share

న్యూఢిల్లీ, మే 21: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే సెటైరికల్ వెబ్‌సైట్‌ తెగ వైరల్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు సైతం ఉన్నారు. ఈ వెబ్‌సైట్ ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, షార్ట్‌ వీడియోలతో సహా సుమారు 50 పోస్ట్‌లను షేర్‌ చేసింది. ఇది ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్స్ తమను తాము A political front of the youth, by the youth, for the youth (యువత యొక్క, యువత చేత, యువత కోసం రాజకీయ వేదిక)గా ప్రకటించుకుంది. ఈ వెబ్‌సైట్‌ సృష్టికర్త అభిజీత్ దీప్కే అనే వ్యక్తి తనను కాక్రోచ్‌ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అని పేరు పెట్టుకున్నాడు. అంతేనా తన పార్టీలో ఎవరైనా చేరొచ్చని, అందుకు తన వెబ్‌సైట్‌లో ఒక ఫారం నింపవల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ ఫారంను నింపి పార్టీలో ఎవరైనా చేరవచ్చని సదరు నోట్‌లో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు.

అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ ఫేక్‌ ప్రొఫెషనల్‌ ధృవపత్రాల కేసు విచారణ సందర్భంగా మే 15, 2026న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు యువత బొద్దింకలు వంటి వారు. వారికి ఎలాంటి ఉపాధి లభించదు. ఏ వృత్తిలోనూ వారికి స్థానం ఉండదు. వీరిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు గంటల వ్యవధిలో వైరల్‌ అయ్యాయి. నిజానికి.. సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ, మీడియా వంటి వృత్తులలోకి ప్రవేశించడానికి ఫేక్‌ డిగ్రీలను ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉద్దేశించి మాత్రమే చేశారు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి తాము ఈ వ్యాఖ్యలు చేయలేదని కూడా చీఫ్‌ జస్టీస్‌ ఆ తర్వాత స్పష్టం చేశారు. కానీ అప్పటికే ఆలస్యమైది. సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే నెట్టింట కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్ దీప్కే మే ​​16, 2026న పొలిటికల్ సెటైరికల్‌ ఉద్యమంగా స్థాపించాడు.

Mysterious: గంపెడు ఆశతో చేపల కోసం వెళ్తే.. జాలరి వలలో చిక్కింది చూసి షాక్‌!

కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక అసలు కథ ఇదీ..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన దీప్కే (30) డిజిటల్ మీడియా వ్యూహకర్త. అతను పూణేలో జర్నలిజం చదివాడు. ఆ తర్వాత బోస్టన్ యూనిర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సిబ్బందిలో ఉద్యోగిగా పనిచేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వైరల్ మీమ్ ఆధారిత కంటెంట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని అనుకరిస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ కోసం ఒక వెబ్‌సైట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను సైతం ఏర్పాటు చేశాడు. ఇందులో దీప్కే చేసిన తొలి పోస్టు ‘బయట ఉన్న ‘బొద్దింకలు’ అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నాను. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారందరూ ఈ పార్టీలో చేరేందుకు అర్హులు’ అని సదరు పోస్టులో పేర్కొన్నాడు. అంతటితో ఆగలేదు.. అదే రోజు cockroachjantaparty.org అనే పార్టీ వెబ్‌సైట్‌ను Voice of the Sozy and Unemployed” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించాడు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది? అని ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అంతే ఈ రెండు పోస్టులు పెట్టిన 48 గంటలలోపే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. ఇన్‌స్టాలో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చిపడ్డారు.

దీప్కే.. ఐదు సూత్రాల మేనిఫెస్టోను, ఒక ఎన్నికల గుర్తును, 25,000 మందికి పైగా నమోదైన సభ్యులను ఏర్పాటు చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీకి ఒక పార్టీ గీతాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఆన్‌లైన్ రాజకీయ ఉద్యమంలో దాదాపు లక్ష మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు మహువా మోయిత్రా (TMC, కృష్ణానగర్), కీర్తి ఆజాద్ (TMC, బర్ధమాన్-దుర్గాపూర్) ఈ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. నేను దేశ వ్యతిరేక పార్టీలో సభ్యురాలిని అయినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీలో కూడా చేరాలనుకుంటున్నాను అని మహువా మోయిత్రా పోస్టు చేయగా.. దానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పందిస్తూ మహువా మోయిత్రా, ప్రజాస్వామ్యానికి అవసరమైన పోరాట యోధురాలు మీరే అని అనుకూలంగా స్పందించింది. ఇక మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేడానికి చేరడానికి కావలసిన అర్హతలేమిటో అని సరదాగా అడిగారు. దానికి సీజేపీ ఇలా బదులిస్తూ 1983 ప్రపంచ కప్ గెలవడమే సరిపడా అర్హత అని తెలిపింది.

ఐక్యత, దృఢత్వం, పురోగతి అనే నినాదంతో వ్యవస్థ లెక్కలోకి తీసుకోని ప్రజల కోసం వెలసిన రాజకీయ పార్టీ అని, ఈ పార్టీకి ఐదు డిమాండ్లు, సున్నా స్పాన్సర్లు, పెద్ద మొండి సమూహం ఉన్నట్లు దీప్కే తెలిపాడు.

  • 1. ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవీ విరమణానంతర బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వరాదు.
  • 2. ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే, ఓటు హక్కును హరించడం ఉగ్రవాదం కంటే తక్కువ కాదు. కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను UAPA కింద అరెస్టు చేయాలి.
  • 3. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా, మహిళలకు 50% రిజర్వేషన్ (33%కి బదులుగా) కల్పించాలి. క్యాబినెట్‌లోని అన్ని పదవులలో 50% మహిళలకు కేటాయించాలి.
  • 4. స్వతంత్ర మీడియాకు అవకాశం కల్పించేందుకు అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. గోడీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలను విచారించాలి.
  • 5. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టడానికి అనర్హులు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఇంకా భారత ఎన్నికల సంఘంలో నమోదు కాలేదు. ఇదొక రాజకీయ ఉద్యమంగా, ప్రజా ఒత్తిడి ప్రచారంగా బహిరంగంగా పిలుచుకుంటుంది. నేను భ్రమలో లేను. ఇది కొన్ని రోజుల్లోనే అంతరించిపోగలదని నాకు తెలుసు అని ఈ ఉద్యమం త్వరగానే అంతరించిపోవచ్చని దీప్కే అంగీకరించాడు. కాగా సోషల్‌ మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్‌ జనతా పార్టీకి కొద్ది రోజుల్లోనే విశేష జనాధారణ దక్కింది. నిజానికి మీడియా ప్రభావం దేశ రాజకీయాల్లోనూ గట్టిగానే వినిపిస్తోంది. 2012లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఇన్‌స్టాగ్రామ్‌లో 19 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బీజేపీకి సుమారు 87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇక కాంగ్రెస్‌కు 132 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

Follow Us