President Elections 2022: ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? ఉపరాష్ట్రపతి వెంకయ్యతో అమిత్ షా, నడ్డా కీలక భేటీ
ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి చేసే ఆనవాయితీ గతంలో ఉండేది. అదే ఆనవాయితీని ఇప్పుడు బీజేపీ కూడా కొనసాగిస్తే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టవచ్చని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు.

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ఎవరు బరిలో నిలుస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President M Venkaiah Naidu) తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) మంగళవారం మధ్యాహ్నం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిపై బీజేపీ పెద్దలు ముమ్మర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మోడీ- షా ద్వయం మనసులో ఎవరున్నారో ఇప్పటి వరకు ఎలాంటి వెల్లడికాలేదు. తాజా భేటీతో వెంకయ్య నాయుడి పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు హస్తినలో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి చేసే ఆనవాయితీ గతంలో ఉండేది. అదే ఆనవాయితీని ఇప్పుడు బీజేపీ కూడా కొనసాగిస్తే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టవచ్చని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఓ అభిప్రాయానికి రాలేమని.. బీజేపీ అధికారిక ప్రకటన వెలువడే వరకు బీజేపీ పెద్దల మనసులో ఎవరున్నారన్నది చెప్పడం సాధ్యంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గిరిజన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్న ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు హస్తిన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గిరిజన వ్యక్తిని రాష్ట్రపతి చేయడం ద్వారా రాజకీయంగా గిరిజనులకు పార్టీని మరింత దగ్గర చేయొచ్చని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గిరిజన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించలేదు. ఆ లోటును భర్తీ చేయాలన్న యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.




వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. పోటీ అభ్యర్థిని బరిలో నిలపాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యస్వంత్ సిన్హాను బరిలో నిలిపనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగానే ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైతే తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన ఎలక్టోరల్ మద్ధతు ఎన్డీయే కూటమికి ఉంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..