త్వరలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. తెలుగువారిలో ఛాన్స్ వీరికే !

త్వరలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. తెలుగువారిలో ఛాన్స్ వీరికే !

కేంద్రంలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. అయిదు నెలల క్రితం తాను ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో స్వల్ప మార్పులు, చేర్పులకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమవుతున్నారు. అయితే గతంలో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలను ఒంటి కన్నుతో మాత్రమే చూశారు ప్రధాని మోదీ. అంటే ఒక్క తెలంగాణకు మాత్రమే ఓ మంత్రి పదవి ఇచ్చేసి, ఏపీపై శీతకన్ను వేశారు. నిజానికి ఏపీ నుంచి ఒక్క ఎంపీ లేనప్పటికీ.. ఏపీకి చెందిన జీవిఎల్ నరసింహారావు లాంటి వారు […]

Rajesh Sharma

|

Oct 18, 2019 | 5:39 PM

కేంద్రంలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. అయిదు నెలల క్రితం తాను ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో స్వల్ప మార్పులు, చేర్పులకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమవుతున్నారు. అయితే గతంలో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలను ఒంటి కన్నుతో మాత్రమే చూశారు ప్రధాని మోదీ. అంటే ఒక్క తెలంగాణకు మాత్రమే ఓ మంత్రి పదవి ఇచ్చేసి, ఏపీపై శీతకన్ను వేశారు. నిజానికి ఏపీ నుంచి ఒక్క ఎంపీ లేనప్పటికీ.. ఏపీకి చెందిన జీవిఎల్ నరసింహారావు లాంటి వారు రాజ్యసభ సభ్యులుగా వున్నారు. వారిని ఏపీకోటాలో మంత్రులను చేస్తారని అప్పట్లో తెగ ప్రచారం జరిగినా అలాంటి చాన్సేమీ వారికి దక్కలేదు. అనూహ్యంగా తొలిసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి తెలంగాణ కోటాలో మంత్రై కూర్చున్నారు.

ఆ తర్వాత ఒకట్రెండు పర్యాయాలు కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు వచ్చినా.. మోదీ అందుకు సిద్దపడలేదు. కానీ ఈసారి మాత్రం కాస్త ఖచ్చితత్వంతో కూడిన సమాచారం వుండడంతో ఇంకొన్ని రోజుల్లోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారైనా ఏపీకి మంత్రి పదవి దక్కుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఏపీలో టిడిపిని ఖాళీ చేయించి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న బిజెపి ఆశలు నెరవేరాలంటే ఏపీకి కనీసం ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. అప్పుడే అధికారంలో వున్న వైసీపీకి పోటీ పడగలమన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.

అయితే.. మంత్రి వర్గ విస్తరణలో ఏపీని పరిగణలోకి తీసుకుంటారో లేదో తెలియదు గానీ.. ఏపీకి చెందిన పలువురు మంత్రి పదవుల రేసు కనిపిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్టీకి మౌత్ పీస్‌లా వ్యవహరిస్తున్న జివిఎల్ నరసింహారావు, గత ప్రభుత్వంలో టిడిపి తరపున మంత్రిగా వ్యవహరించి, ప్రస్తుతం బిజెపిలో చేరిన సుజనా చౌదరి వంటి వారు కేబినెట్ హోదాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. జాతీయ మీడియాతోపాటు తెలుగు లోకల్ మీడియాలో పార్టీ మౌత్ పీస్‌గా వ్యవహరిస్తూ.. పార్టీ విధానాలను, వాదనలను సమర్థవంతంగా వినిపిస్తున్న తనకు పదవి దక్కడం సమంజసమని జివిఎల్ భావిస్తున్నా.. పైకి ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఇష్టపడడం లేదు. బయట పడితే మోదీ, అమిత్ షాల కళ్ళలో పడి దక్కే ఛాన్స్ కూడా మిస్సవుతుందన్నది జివిఎల్ భయమని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

ఇక టిడిపికి వున్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురిని చీల్చి, ఆ పార్టీ రాజ్యసభాపక్షాన్ని బిజెపిలో విలీనం చేసి చంద్రబాబుకు దెబ్బకొట్టిన సుజనా చౌదరి కూడా తాను కేబినెట్ మంత్రి పదవికి అర్హుడనని భావిస్తున్నారు. పైగా గత మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో పని చేసిన అనుభవం తన సొంతమని భావిస్తున్నారాయన. గత ఎన్నికలకు ముందు మోదీని, అమిత్ షాను తెగతిట్టిపోసిన చంద్రబాబును దెబ్బకొట్టడం ద్వారా బిజెపి అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకున్నానన్నది ఆయన అభిప్రాయం. సో.. వీరిద్దరు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కుతుందన్న అంఛనాల్లో వున్నారు. అదే సమయంలో మరికొందరు కనీసం సహాయ మంత్రి పదవైనా దక్కాలని కోరుకుంటున్నారు. తొలిసారి గెలిచిన కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వగా లేనిది.. తమకెందుకు దక్కకూడదని అనుకుంటున్న వారూ లేకపోలేదు.

ఇక తెలంగాణలో గెలిచిన ముగ్గురు ఎంపీలలో ఒకరికి మంత్రి పదవి దక్కింది. మిగిలిన ఇద్దరు కూడా తొలిసారి ఎంపీలైన వారే. వారిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తే.. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీపై పోరాడే పరిస్థితి పెరుగుతుందని ఆయన అంటున్నారు. అరవింద్ యత్నాలకు ఆయన తండ్రి డి.శ్రీనివాస్ రాజనీతిజ్హత కూడా తోడైతే అరవింద్‌కు ఏ సహాయ మంత్రి పదవో దక్కుతుందని చెప్పుకుంటున్నారు.

అయితే.. సుదీర్ఘ కాలంగా సంఘ్ పరివార్ సంస్థల్లో పని చేస్తున్న ప్రస్తుత బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ముందు పదవిచ్చి… ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ కావాలని మురళీధర్ రావు ఆశిస్తున్నారు. ఇక ఇటీవల గవర్నర్ పదవి కోల్పోయిన మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు కూడా యాక్టివ్ పాలిటిక్స్‌లో తనకు పదవి దక్కాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు వయోభారం అడ్డంకిగా మారుతుందని పలువురు చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా.. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల వైపు చూస్తారో లేదో.. లేక చిన్నపాటి మంత్రి వర్గ సర్దుబాటుకే పరిమితిమవుతారో తెలియదు గానీ.. పదవుల పందేరంలో తెలుగు రాష్ట్రాల కమలనాథులు మాత్రం ఢిల్లీ చుట్టూ చక్కర్లు తెగ కొట్టేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu