PM Narendra Modi: ఈ సారి ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. పూర్తి వివరాలు ఇవే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనలో ప్రధానిమోదీ బిజి బిజిగా గడపనున్నారు. జులై మొదటి వారంలో బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు.

ప్రధాని మోదీ వచ్చే నెలలో వారం రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనలో ప్రధాని మోదీ బిజిబిజిగా గడపనున్నారు. జూలై 02-03 తేదీల్లో ఘనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ తొలిసారిగా ప్రధాని హోదాలో అక్కడికి వెళ్తున్నారు. మూడు దశాబ్దాల తరువాత ఘనాలోని పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోడీ నిలవనున్నారు. ఘనాతో ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలుపై ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం, ఆఫ్రికన్ యూనియన్‌తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడనుంది.
జూలై 03, 04 తేదీల్లో ట్రినిడాడ్ & టొబాగో పర్యటన
రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్-బిస్సేసర్ ఆహ్వానం మేరకు జూలై 03 – 04, తేదీల్లో ట్రినిడాడ్ & టొబాగోలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి. 1999 తర్వాత T&T కు ప్రధాన మంత్రి స్థాయిలో చేస్తున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాని కమ్లా పెర్సాద్-బిస్సేసర్‌లతో ప్రధాని చర్చలు జరపనున్నారు. తర్వాత T&T పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ T&T సందర్శన రెండు దేశాల మధ్య లోతైన, చారిత్రక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.
జులై 4- 5 తేదీల్లో అర్జెంటీనా పర్యటన
ఇక జులై 4- 5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు,ప్రజా సంబంధాల వంటి కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలపై ఆదేశ అధ్యక్షుడు మిలేతో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. దీంతో పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన చర్చించనున్నారు. ప్రధానమంత్రి ద్వైపాక్షిక పర్యటన భారతదేశం అర్జెంటీనా మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.
జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్ పర్యటన
ఇక జూలై 5-8 తేదీల్లో ప్రధాని మోదీ బ్రెజిల్‌లో పర్యటించనున్నారు. ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రపంచ పాలన సంస్కరణ, శాంతి భద్రత, బహుపాక్షికతను బలోపేతం చేయడం, కృత్రిమ మేధస్సు, బాధ్యతాయుతమైన ఉపయోగం, వాతావరణ చర్య, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక విషయాలతో సహా కీలకమైన ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ పంచుకుంటారు. అనంతరం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అనేక దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల జరపనున్నారు. బ్రెజిల్ అధికారిక పర్యటనలో బ్రెసిలియాకు వెళ్ళి బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, రక్షణ, శక్తి, అంతరిక్షం, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజా సంబంధాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై భారత్- బ్రెజిల్ మధ్య చర్చలు జరగనున్నాయి.
జులై 9న నమీబియా పర్యటన..
ఇక జులై 9న రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ నెతుంబో నంది-న్దైత్వా ఆహ్వానం మేరకు నమీబియాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మొదటి సారి నమీబియాకు వెళ్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు నంది-న్దైత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. నమీబియా వ్యవస్థాపక పితామహుడు మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ సామ్ నుజోమాకు నివాళులర్పించిన తర్వాత నమీబియా పార్లమెంటులో ప్రధాని ప్రసంగం ఉండనుంది. నమీబియాతో భారతదేశానికి ఉన్న బహుముఖ లోతైన చారిత్రక సంబంధాలను ప్రధాని పర్యటన పునరుద్ఘాటీంచనుంది.
ఈ విధంగా వారం రోజులపాటు ఐదు దేశాల్లో బిజి బిజిగా ప్రధాని మోదీ పర్యటన సాగనుంది.మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు దేశ విదేశాంగ విధానాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
