PM Modi: సోమవారం హక్కుల నేత హర్మోహన్ సింగ్ యాదవ్ వర్ధంతి.. ప్రధాని మోడీ కీలక ప్రసంగం
రైతులు, వెనుకబడిన తరగతులు, సమాజంలోని ఇతర వర్గాల కోసం దివంగత ఎస్పీ నేత హర్మోహన్ సింగ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రధానమంత్రి ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పీఎంఓ తెలిపింది.
Harmohan Singh Yadav death anniversary: దివంగత నాయకుడు, మాజీ ఎంపీ హర్మోహన్ సింగ్ యాదవ్ 10వ వర్ధంతి సందర్భంగా సోమవారం (July 25) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైతులు, వెనుకబడిన తరగతులు, సమాజంలోని ఇతర వర్గాల కోసం దివంగత ఎస్పీ నేత హర్మోహన్ సింగ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రధానమంత్రి ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పీఎంఓ తెలిపింది. హర్మోహన్ సింగ్ యాదవ్ ఒక మహోన్నత వ్యక్తి.. భారత యాదవ్ సంఘం నాయకుడిగా సుపరిచితులు. ఆయన చాలా కాలం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన కుమారుడు సుఖరామ్ సింగ్ యాదవ్ కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
31 ఏళ్ల వయసులో హర్మోహన్ సింగ్ యాదవ్ రాజకీయ ఆరంగ్రేటం..
హర్మోహన్ సింగ్ యాదవ్ అక్టోబర్ 18, 1921న కాన్పూర్‌లోని ‘మెహర్బన్ సింగ్ కా పూర్వా’ గ్రామంలో జన్మించారు. 31 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1952లో గ్రామ ‘ప్రధాన్’ పదవి చేపట్టారు. 1970 నుంచి 1990 వరకు UPలో MLC గా, MLA గా వివిధ హోదాలలో పనిచేశారు. 1991లో ఆయన మొదటిసారిగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. 1997లో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు. ‘అఖిల భారతీయ యాదవ్ మహాసభ’ జాతీయ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
ఎమర్జెన్సీని ఎదురించి..
హర్మోహన్ యాదవ్.. చౌదరి చరణ్ సింగ్, రామ్ మనోహర్ లోహియాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఎమర్జెన్సీని ఎదిరించి రైతు హక్కుల కోసం ఉద్యమిస్తూ జైలు పాలయ్యారు. హర్మోహన్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి ముఖ్యమైన నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్‌తో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. చౌదరి చరణ్ సింగ్ మరణానంతరం.. యాదవ మహాసభకు ములాయం సింగ్ యాదవ్ నాయకుడవ్వాలని హర్మోహన్ ప్రతిపాదించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ స్థాయి విపరీతంగా పెరిగింది.
తన కుమారుడు సుఖరామ్ సింగ్ సహాయంతో.. హర్మోహన్ యాదవ్ కాన్పూర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక విద్యా సంస్థలను స్థాపించారు. హర్మోహన్ సింగ్ యాదవ్ జూలై 25, 2012న మరణించారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో.. తెగించి మరి..
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు జరగడానికి ఆరు సంవత్సరాల ముందు హర్మోహన్ సింగ్ యాదవ్, అతని కుటుంబం సిక్కు జనాభాలో ఎక్కువ మంది ఉన్న కొత్త ప్రదేశానికి వెళ్లారు. యాదవ్‌కు సిక్కులతో మంచి సంబంధం ఉంది. అప్పుడప్పుడు వారికి సహాయం చేసేవారు. అల్లర్ల సమయంలో యాదవ్ తన కుమారుడు సుఖరామ్‌తో కలిసి ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు వారి వద్ద రైఫిల్, కార్బైన్ తుపాకులు ఉన్నాయి. అల్లరి మూకలు వారి ప్రాంతానికి చేరుకున్నప్పుడు.. వారు టెర్రస్‌పైకి వెళ్లి గాలిలో కాల్పులు జరిపారు.. సిక్కులపై దాడి చేసేందుకు వచ్చిన వారిని తరిమికొట్టారు.
స్థానిక సిక్కులు ఆశ్రయం కోసం యాదవ్ ఇంటికి చేరుకోగా.. వారికి బస కల్పించారు. సిక్కులను రక్షించినందుకు భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ 1991లో హర్మోహన్ సింగ్ యాదవ్‌కు శౌర్య చక్రను ప్రదానం చేశారు. ఇది శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మబలిదానాలకు ప్రదానం చేసే భారతీయ సైనిక అవార్డు. ఇది పౌరులకు, సైనిక సిబ్బందికి అందజేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..