PM Narendra Modi Gujarat Visit: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటికే రెండు నెలల్లో మూడు సార్లు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తాజాగా శనివారం కూడా పర్యటిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌కోట్‌లోని అత్‌కోట్‌లో కొత్తగా నిర్మించిన మాతుశ్రీ కేడీపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. దీంతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రధాన మంత్రి సందర్శిస్తున్న మాతుశ్రీ KDP మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను శ్రీ పటేల్ సేవా సమాజ్ నిర్వహిస్తోంది. దీనిలో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు.
Gujarat | Prime Minister Narendra Modi inaugurates the newly built Matushri KDP Multispeciality Hospital in Atkot, Rajkot. pic.twitter.com/M92aXgpDWF
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో సాయంత్రం 4 గంటలకు ‘సహకార్ సే సమృద్ధి’పై వివిధ సహకార సంస్థల నాయకుల సెమినార్‌లో ప్రసంగిస్తారు. అక్కడ నానో యూరియా (ద్రవ) ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్‌ను IFFCO ఆధ్వర్యంలో కలోల్‌లో నిర్మించారు.
రోల్ మోడల్‌గా గుజరాత్..
అంతకుముందు ప్రధాని కార్యాలయం ట్విట్ చేసి ప్రధాని మోడీ పర్యటన గురించి వెల్లడించింది. పీఎంవో ప్రకారం.. గుజరాత్ సహకార రంగం మొత్తం దేశానికి రోల్ మోడల్‌గా ఉంది. రాష్ట్రంలో సహకార రంగంలో 84,000 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. సుమారు 231 లక్షల మంది సభ్యులు ఈ సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ‘సహకార్ సే సమృద్ధి’పై వివిధ సహకార సంస్థల నాయకుల సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ సహకార సంస్థల నుంచి 7,000 మందికి పైగా ప్రతినిధులు సెమినార్‌లో పాల్గొననున్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ సైతం ట్విట్ చేశారు. “సాయంత్రం 4 గంటలకు గాంధీనగర్‌లో జరిగే ‘సహకార్ సే సమృద్ధి’ కార్యక్రమంలో సహకార రంగంలోని ప్రముఖులతో వేదికను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను. రాష్ట్ర పురోగతిలో గుజరాత్ సహకార రంగం పెద్ద పాత్ర పోషించింది.” అంటూ పేర్కొన్నారు.
ఇఫ్కో ఆధ్వర్యంలో రూ. 175 కోట్లతో (నానో యూరియా లిక్విడ్ ప్లాంట్) అల్ట్రామోడర్న్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ రోజుకు 500 మిల్లీలీటర్ల 1.5 లక్షల బాటిళ్లను ఉత్పత్తి చేయనుంది. కాగా.. ‘సహకార్ సే సమృద్ధి’ సెమినార్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హాజరు కానున్నారు.