PM Modi Meet: దేశంలో టీకా డ్రైవ్ సరళీకృతం.. ఇవాళ వ్యాక్సిన్స్ ఉత్పత్తిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
PM Modi Meet: దేశవ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తుంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోదీ టీకా తయారీ సంస్థలతో భేటీకానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.
దేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీకా తయారీ సంస్థలతో ప్రధాని సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా టీకాల ఉత్పత్తి వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సమావేశంలో బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ప్రంటేషన్ ఇవ్వడంతో పాటు.. కంపెనీలను సమన్వయం చేసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వర్చువల్ జరుగుతున్న ఈ భేటికీ దేశీయ వ్యాక్సి్‌న్ తయారీదారులతో పాటు విదేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాక్సిన్ తయారీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
వైరస్ కట్టడిలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు టీకాలకు అనుమతి ఇచ్చింది. సీరం ఇనిసిట్యూట్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా టీకా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యాలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండగా.. త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రావాలని భావిస్తున్నాయి. ఈ మేరకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 1.50 కోట్లు దాటాయి. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.
మే ఒకటో తేదీ నుంచి దేశంలో ప్రతి ఒక్కరికి టీకాలు వేసేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. అలాగే రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు తయారీ సంస్థల నుంచి టీకాలు కొంత మేరకు నేరుగా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. టీకా డ్రైవ్‌ను సరళీకృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం టీకాల కంపెనీలతో భేటీకానున్నారు. సమావేశంలో టీకా ఉత్పత్తిదారులతో సహా దేశంలోని ప్రముఖ వైద్యులు సైతం హాజరుకానున్నారు. ఇందులో వ్యాక్సినేషన్, ఉత్పత్తి పెంపు తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Also… కరోనా ఉధృతి కారణంగా పెరుగుతున్న ఆంక్షలు.. భారత ప్రయాణ రాకపోకలపై అమెరికా కీలక సూచనలు