ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఎక్స్‌ప్రేస్‌వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!

దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజా రవాణాకు వెన్నెముకగా నిలిచే జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలోని అతి పొడవైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్దమైంది. ఈ హైవే ఈ నెలాఖరులో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 29న ప్రధాని మోదీ ఈ హైను జాతికి అంకింత చేయనున్నారు.

ఆ రూట్లో వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఎక్స్‌ప్రేస్‌వే.. సగానికి సగం తగ్గనున్న జర్నీ టైమ్!
Ganga Expressway

Edited By:

Updated on: Apr 25, 2026 | 5:05 PM

జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 594 కి.మీ. పొడవైన ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు నవంబర్ 2022లో శంకుస్థాపన జరిరగ్గా.. కేవలం 1,000 రోజుల్లోనే నిర్మాణం పూర్తవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో ఒకే దశలో నిర్మించిన అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది గుర్తింపు పొందింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే హరిద్వార్-ప్రయాగ్‌రాజ్ మధ్య ధార్మిక పర్యాటకాన్ని మరింత పెంచనుంది. పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్ మధ్య ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఈ ఎక్స్ ప్రెస్ వే చాలా కీలకంగా మారుతుంది. రియల్ ఎస్టేట్, వ్యవసాయ లాజిస్టిక్స్‌కు కూడా బూస్ట్ ఇస్తుంది

రూ. 36 వేల కోట్లతో 594 కి.మీ. మేర 6 లేన్లతో ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితమైంది. భవిష్యత్‌లో దీనిని 8 లేన్లకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు మొత్తం 12 జిల్లాలను కలుపుతుంది. ఇది మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభల్, బదాయూన్, షాజహాన్‌పూర్, హర్దోయి, ఉన్నావ్, రాయ్‌బరేలి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది. మీరు ఈ హైవేపై ప్రయాణించాలంటే పూర్తి మార్గానికి సుమారు రూ. 1,300 టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ హైవేపై మీరు 120 కి.మీ. స్పీడ్‌తో ప్రయాణించవచ్చు. దీనివల్ల మీరట్ – ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుండి కేవలం 6 గంటలకు తగ్గుతుంది.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. అత్యాధునిక సాంకేతికతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ప్రతి 1 కిలోమీటర్‌కు ఒక సీసీటీవీ కెమెరా, ప్రతి 10కిలోమీటర్ల ఒక స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే అత్యవసర లేన్, అండర్‌పాస్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు అత్యవసర విమాన ల్యాండింగ్ కోసం షాజహాన్‌పూర్‌లో 3.5 కి.మీ. పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలానే దేశంలోనే మొదటిసారిగా 9 ఫెసిలిటీ ప్లాజాలు ఏర్పాటు చేశారు. వీటిలో పెట్రోల్ బంకులు, ఈవీ చార్జింగ్, ఫుడ్ కోర్టులు, ట్రామా సెంటర్లు ఉన్నాయి. ప్రతి 50 కి.మీ.కి అంబులెన్స్, టోయింగ్ సేవలు అందుబాటులో ఉంచారు. మొత్తం ఈ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరప్రదేశ్ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us