నీటి కోసం తోడితే నిప్పు పుడుతోంది.. బావుల నుంచి డీజిల్ ప్రవాహం! తీరంలో టెన్షన్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యం యుద్ధమేఘాల నేపథ్యంలో చమురు ధరలు, సంక్షోభంపై చర్చలు జరుగుతుంటే, కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరులో మాత్రం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. నగరంలోని కావూర్ ప్రాంతంలో మూడు నివాస గృహాలకు చెందిన బావుల నుంచి అకస్మాత్తుగా నీళ్లకు బదులు డీజిల్ పొంగిపొర్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యం యుద్ధమేఘాల నేపథ్యంలో చమురు ధరలు, సంక్షోభంపై చర్చలు జరుగుతుంటే, కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరులో మాత్రం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. నగరంలోని కావూర్ ప్రాంతంలో మూడు నివాస గృహాలకు చెందిన బావుల నుంచి అకస్మాత్తుగా నీళ్లకు బదులు డీజిల్ పొంగిపొర్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ బావి నీటిని ప్రయోగశాల పరీక్షలకు పంపగా, ఆ నివేదికలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. బావి నీటిలో ఇతర మలినాలు ఏవీ లేవని, ఏకంగా 28 శాతం స్వచ్ఛమైన డీజిల్ ఉందని తేలింది. బావి నుంచి తోడిన నీటిలో ఒక కాగితాన్ని ముంచి నిప్పు పెడితే, అది పెట్రోల్ పోసినట్లుగా భగ్గున మండుతోంది. ఈ పరిస్థితి భూగర్భ జల వనరులు ఎంత దారుణంగా కలుషితమయ్యాయో అర్థం చేస్తోంది.
బాధితుల్లో ఒకరైన సదాశివ ఈ దుస్థితిపై మాట్లాడుతూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. “మేము బావి నీళ్లు తోడుకున్నప్పుడు ఘాటైన వాసన రావడంతో అనుమానం వచ్చింది. బావిని ఎన్నిసార్లు తోడి శుభ్రం చేసినా, భూమి లోపలి నుంచి డీజిల్ మందపాటి పొరలా నీటిపైకి వస్తూనే ఉంది. ఇప్పుడు మాకు తాగడానికి నీళ్లు లేవు. కనీసం గిన్నెలు కడగడానికి కూడా వీలు పడటం లేదు. బయటి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని బకెట్లలో నింపుకోవాల్సి వస్తోంది,” అని ఆయన వాపోయారు.
ఇదిలావుంటే, బావులకు అతి సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది. దాని భూగర్భ ట్యాంక్ నుండి లీకేజీ జరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. అయితే, పెట్రోల్ బంక్ యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. “మా స్టాక్‌లో ఎలాంటి తేడా లేదు, లీకేజీ సమస్యే లేదు” అని కొట్టిపారేస్తుండటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య శాఖ అధికారులు నీటి నమూనాలు సేకరించి, అవి తాగడానికి పనికిరావని తేల్చి చెప్పినప్పటికీ, కార్పొరేషన్ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీ చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. బావి నీరు అంటుకునే స్వభావం కలిగి ఉండటంతో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి, ఈ రహస్య లీకేజీ మూలాలను కనుగొని, భూగర్భ జలాలు మరింత కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కావూర్ నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఇది పర్యావరణ విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
