PM Modi: గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ
వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి ఉపయోగపడుతుందన్నారు ప్రధాని మోదీ. మరిన్ని నూతన ఆవిష్కరణలను సైతం ఇది ప్రోత్సహిస్తోందని తెలిపారు. దీని ద్వారా దేశం అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
భారత్ మండపంలో నిర్మించిన ప్రధానమంత్రి గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రధాన మంత్రి గతి శక్తి ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరిగింది. గతి శక్తి ద్వారా జరుగుతున్న పనులు, అక్కడి నుంచి జరుగుతోన్న కార్యచరణ, దేశవ్యాప్తంగా పథకాల ప్రణాళికలు, కార్యక్రమాలు నిర్వహించడంలో సాధించిన పురోగతిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేయడంలో భాగంగా… వివిధ రంగాల్లో దీనిని అడాఫ్ట్ చేయడం అభినందనీయమన్నారు. గతిశక్తి… దేశంలోని రైల్వే, రోడ్లు, జలమార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తోందన్నారు.
ప్రధాన మంత్రి గతిశక్తి పోర్టల్‌లో స్కూల్స్ మ్యాప్ చేశామని, తద్వారా సమీపంలోని ఇతర పాఠశాలలను భౌగోళిక సమాచారం ఆధారంగా గుర్తించవచ్చని, తద్వారా సమీపంలోని ఇతర పాఠశాలలను కూడా అనుసంధానించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి గతిశక్తి ఫ్రేమ్‌వర్క్‌ను వివిధ అంతర్జాతీయ ఫోరమ్‌లలో ప్రదర్శించినట్లు చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల వంటి దేశాలతో దీని ద్వారా జ్ఞానాన్ని పంచుకోవడంపై అవగాహన ఒప్పందం జరుగుతుంది అని మోదీ చెప్పారు. మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను తీసుకువచ్చామని మోదీ చెప్పారు.
ఇక దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉత్పత్తుల ఎంపిక, బ్రాండింగ్, ప్రచారంలో సహాయం చేయడంలో ODOP చొరవ సాధించిన పురోగతిని మోదీ ప్రశంసించారు.
గతి శక్తి వల్ల అభివృద్ధి చెందిన భారతదేశం కల సాకారమవుతోంది
అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాకారం చేసుకునే దిశగా భారతదేశం వేగాన్ని పెంచుతోందని ప్రధాన మంత్రి అన్నారు. గతి శక్తి అందులో కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. పురోగతి, వ్యవస్థాపకత, ఆవిష్కరణలను గతి శక్తి ప్రోత్సహిస్తుందని చెప్పారు. జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ఉపయోగించి, ఆర్థిక వ్యవస్థలోని కీలకమైన బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఓడరేవులు, ఆహారం, ప్రజాపంపిణీ మొదలైన వాటికి సంబంధించిన కనెక్టివిటీకి గతి శక్తి కీలకమైనది చెప్పారు. వివిధ ఆర్థిక ప్రణాళికలకు బహుళ-మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను అందించడం కోసం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్(PMGS-NMP)ను 2021, అక్టోబర్ 13న అమల్లోకి తీసుకువచ్చారు.
గతిశక్తి ద్వారా డిజిటల్ సర్వేలతో, ప్రాజెక్ట్ తయారీ ఇప్పుడు వేగంగా, మరింత ఖచ్చితమైన వేగంతో జరుగుతోంది. దీని ద్వారా.. రైల్వే మంత్రిత్వ శాఖ కేవలం ఒక సంవత్సరంలోనే 400 కంటే ఎక్కువ రైల్వే ప్రాజెక్టులు, 27,000 కి.మీ రైల్వే లైన్లను ప్లాన్ చేసిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..