ప్రధాని మోదీని కలిసేందుకు కాలినడకన ఓ యువకుని సుదీర్ఘ ‘పాద యాత్ర’.. ఎవరా వ్యక్తి ? ఎక్కడి నుంచి ?
ప్రధాని మోదీని కలిసేందుకు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఓ యువకుడు సుదీర్ఘ 'పాదయాత్ర' చేపట్టాడు. శ్రీనగర్ లోని షాలిమార్ ప్రాంతానికి చెందిన ఫాహిమ్ నాజిర్ షా అనే యువకుడు తన 815 కి.మీ. పాదయాత్రను ఈ నెల 21 నుంచి మొదలుపెట్టాడు. పార్ట్ టైం ఎలెక్ట్రీషియన్ గా...
ప్రధాని మోదీని కలిసేందుకు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఓ యువకుడు సుదీర్ఘ ‘పాదయాత్ర’ చేపట్టాడు. శ్రీనగర్ లోని షాలిమార్ ప్రాంతానికి చెందిన ఫాహిమ్ నాజిర్ షా అనే యువకుడు తన 815 కి.మీ. పాదయాత్రను ఈ నెల 21 నుంచి మొదలుపెట్టాడు. పార్ట్ టైం ఎలెక్ట్రీషియన్ గా పని చేస్తున్న ఇతగాడు 200 కి.మీ. నడిచి నిన్న ఉద్ధం పూర్ చేరుకున్నాడు. ఈ సారి ఎలాగైనా మోదీని కలుసుకోగలనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇది తన ఆశయమన్నారు. లోగడ చాలాసార్లు ఆయనతో భేటీ కావాలనుకున్నానని కానీ కలుసుకోలేకపోయానని ఈ యువకుడు చెప్పాడు. కాలినడకన వెళ్తేనన్నా తనకు ఆయనను కలిసే భాగ్యం దక్కుతుందని ఆశిస్తున్నానని ఫాహిమ్ చెప్పాడు. నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో నేను ప్రధానిని ఫాలో అవుతున్నాను.. ఆయన ప్రసంగాలు, ఆయన చర్యలు నాకెంతో నచ్చాయి.. అని పేర్కొన్నాడు. ఒకసారి మోదీ ప్రసంగిస్తుండగా మసీదులో ప్రార్థన వినిపించగానే ఆయన తన స్పీచ్ ఆపేశారని, అది తననెంతో ప్రభావితం చేసిందన్నారు.అప్పటి నుంచే తాను ఆయనకు వీరాభిమానినయ్యానన్నాడు.
రెండున్నర సంవత్సరాల క్రితం ప్రధాని జమ్మూ కాశ్మీర్ వచ్చారని. అప్పుడు కూడా ఆయనతో కలిసేందుకు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని ఫాహిమ్ విచారంగా తెలిపాడు. జమ్మూ కాశ్మీర్ కి కేంద్రం రాష్ట్ర హోదాను రద్దు చేసినప్పటి నుంచి అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపాడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నానని, ప్రధాని అవకాశమిస్తే ఇదే విషయాన్నీ ఆయనకు చెబుతానని తెలిపాడు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని, నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరుతానని ఫాహిమ్ నాజిర్ షా వెల్లడించాడు. ఎప్పటికి ఢిల్లీ చేరుకోగలుగుతానో చెప్పలేనని అన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.