Lok Sabha Election 5th Phase Polling : సోమవారం జరిగే లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాయ్‌బరేలి నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ , లక్నో నుంచి రాజ్‌నాథ్ లాంటి ప్రముఖులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. ఈనెల 20వ తేదీన 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదో దశలో యూపీ లో 14, మహారాష్ట్రలొ 13, బెంగాల్ లో 7 స్థానాలు, బీహార్‌లొ 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్, లడఖ్ లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయ్యింది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో బీజేపీ , ఇండియా కూటమి మధ్య పలు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది.
అయితే ఈ దఫాలో రెండు నియోజకవర్గాల పైనే అందరి కళ్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలో ఆసక్తికర పోటీ నెలకొంది. రాయ్‌బరేలిలో సోనియాగాంధీ స్థానంలో రాహుల్‌గాంధీ పోటీలో ఉన్నారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్ధిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అన్ని తానై నడిపించారు ప్రియాంకాగాంధీ. అమేథీతో పాటు రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలి నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అమేథీలో చివరిరోజు భారీ రోడ్‌షో నిర్వహించారు . బీజేపీ కూడా అదేస్థాయిలో ప్రచారం చేసింది. అమేథీలో స్మృతి ఇరానీకి మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.
2024 పార్లమెంట్ ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా.. ఐదో దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా ఈ ఐదో దశలో లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్ నాథ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్ గంజ్ నుంచి బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. ఐదో దశలో మొత్తం 659 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బలగాలను పోలింగ్ కేంద్రాల దగ్గరకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…