
ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర.. ఇలా దేశంలోని అష్టదిక్కులా బహుముఖ వ్యూహంతో విపక్ష కూటమి విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. బిహార్ రాజధాని పాట్నాలో నితీశ్ కుమార్ – తేజస్వి యాదవ్ ఏర్పాటు చేసిన తొలి సమావేశంతో మొదలైన విపక్ష కూటమి ప్రయాణం.. బెంగళూరులో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రెండో సమావేశంతో కొత్త పేరును ఖరారు చేసుకుని రూపురేఖలు సంతరించుకుంది. ‘ఇండియన్(I) నేషనల్(N) డెవలప్‌మెంటల్(D) ఇంక్లూజివ్(I) అలయన్స్(A)’ పేరుతో సంక్షిప్త రూపంలో INDIA అని వచ్చేలా పేరును నిర్ణయించారు. మొత్తం 11 మందితో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తదుపరి సమావేశాన్ని దేశ ఆర్థిక రాజధాని ‘ముంబై’లో నిర్వహిస్తామని, ఆ సమావేశంలో కూటమి కన్వీనర్‌ను ఖరారు చేస్తామని కూటమి నేతలు వెల్లడించారు. ఉత్తర భారతదేశంలోని పాట్నా, దక్షిణ భారతదేశంలోని బెంగళూరు సమావేశాలు ముగిశాయి. తదుపరి పశ్చిమ భారతదేశంలోని ముంబైలో జరుగుతుంది. ఇక తూర్పున ఉన్న కోల్‌కత్తాతో పాటు మళ్లీ ఈ దిక్కులన్నీ పునరావృతం చేస్తూ వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరు నగరాల్లో తదుపరి సమావేశాలు నిర్వహించాలని విపక్ష నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా దేశమంతటా తమ కూటమి గురించి చర్చ జరగుతుందని, స్థానికంగా ఆతిథ్యమిచ్చే పార్టీలకూ ప్రాధాన్యతనిచ్చినట్టు ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు.
ప్రతి అడుగూ వ్యూహాత్మకం
అనైక్యత, విబేధాలకు నిలయంగా ఉంటుందనుకున్న ప్రతిపక్ష కూటమిలో ఎలాగైనా సరే బీజేపీని గద్దె దించాలన్న పట్టుదలే ఎక్కువగా కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య సఖ్యత విషయంలో ఇబ్బందులున్నా సరే.. ప్రస్తుతం ఉమ్మడి శత్రువుగా ఉన్న కాషాయదళాన్ని ఇంటికి పంపడం మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఏడాదిలోపే జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం మెగా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. అందులో అష్టదిక్కులా విస్తరించాలన్నది ఒక వ్యూహాం. ఇక నుంచి ప్రతి నెలా ఒక్కో రాష్ట్రంలో కూటమి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కూటమిలోని 26 భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలోనే బలీయమైన శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా 450 నియోజకవర్గాల్లో కూటమి తరఫున బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఐకమత్యమే మహాబలమని, ఎన్ని అరమరికలున్నా సరే కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవాలన్న తపన కూటమిలోని దాదాపు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. గతంలో కూటమికి ఉన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) పేరును మార్చి సామాన్యులను సైతం ఆకట్టుకునేలా ‘ఇండియా’ అని అర్థం వచ్చేలా పేరును ఎన్నుకోవడం కూడా ఒక వ్యూహమే. అలా మొత్తానికి ప్రతి అడుగులోనూ ఒక వ్యూహం ఉండేలా విపక్ష కూటమి ప్రణాళికలు రచిస్తోంది.
ముంబైలో మీటింగ్‌లో ఏం జరుగుతుంది?
ముంబైలో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశం ఆగస్టు రెండు లేదా మూడో వారంలో జరగనుంది. ఈ సమావేశానికి శివసేన (ఉద్ధవ్ వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ క్యాంప్) మరియు కాంగ్రెస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు పార్టీలు ఇప్పటికే మహారాష్ట్రలో కలసి సాగుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు సమావేశానికి కొద్ది రోజుల ముందే ఎన్సీపీలో చీలికను తీసుకొచ్చి ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయాలని చూసిన కమలనాథులకు, ముంబైలో మూడు పార్టీలూ కలిసి నిర్వహించే విపక్ష కూటమి సమావేశం ద్వారా బలమైన సందేశాన్ని పంపాలని చూస్తున్నారు. అలాగే మూడు పార్టీల మధ్య దోస్తీ చెక్కుచెదరలేదని చాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దేశంలోని పశ్చిమ భాగంలో జరిగే ఈ సమావేశంలో ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌ను కూడా ఖరారు చేస్తారని తెలుస్తోంది. గతంలో యూపీఏ కూటమికి ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ వ్యవహరించారు. ఇప్పుడు ఆమె వయోభారంతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే లేదంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కూటమిని సమన్వయపరిచే బాధ్యత అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా సుదీర్ఘ రాజకీయానుభవంతో పాటు అందరినీ కలుపుకుని వెళ్లగలిగే సమర్థత కల్గిన నేతకే ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
పశ్చిమం నుంచి తూర్పుకు పయనం
ముంబై సమావేశం తర్వాత దేశానికి తూర్పు దిక్కున… ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్‌క్వార్టర్‌గా ఉన్న కోల్‌కత్తా నగరంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు విపక్ష కూటమి నేతలు చెబుతున్నారు. కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నాలుగో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. కేంద్రంలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాల్లోనూ విస్తరిస్తూ వెళ్తున్న బీజేపీ జైత్రయాత్రకు బ్రేకులు వేసిన ఘనతతో పాటు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన మమత బెనర్జీ కూటమిలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కూటమి పేరును ‘మహా ఘట్‌బంధన్’ వంటి హిందీ అక్షరాలతో ఉండేలా చూడాలని సోనియా గాంధీ ప్రతిపాదించగా.. అంతకు మించి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ చేరుకునేలా INDIA అని అర్థం వచ్చేలా పేరును సూచించింది కూడా మమత బెనర్జీయే అని కొన్ని కథనాలున్నాయి. ఏదేమైనా తూర్పున ఉన్న కోల్‌కత్తా సమావేశంతో విపక్షాల యాత్ర ముగిసిపోదు.
యూపీలోనూ…
కోల్‌కత్తా తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సమావేశాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. యూపీలో జరిగే సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ రాష్ట్రం నుంచి సమాజ్‌వాదీతో పాటు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), కాంగ్రెస్, అప్నాదళ్ (కృష్ణ పటేల్)తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ (చంద్రశేఖర్ ఆజాద్) ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్నాయి. వీటన్నింటిలో సమాజ్‌వాదీయే పెద్ద పార్టీ కావడం, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు ఉండడంతో అక్కడ జరగబోయే సమావేశంలో ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటారు. తద్వారా స్థానిక మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల్లోకి మెరుగైన రాజకీయ సందేశాన్ని పంపడానికి ఆస్కారం ఉంటుందని విపక్షాలు భావిస్తున్నాయి. కూటమి గురించి స్థానికంగా జరిగే ప్రచారంతో రాజకీయంగా బీజేపీకి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించవచ్చని.. ఫలితంగా కూటమిలోని అన్ని పార్టీలకూ ప్రయోజనం కల్గుతుందని లెక్కలు వేస్తున్నాయి. రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి, కూటమిలో భాగంగా ఉన్న పార్టీల విషయంలో ఐక్యత, సమన్వయం పెంపొందించవచ్చని, అలాగే కూటమిలోని పార్టీలన్నింటికీ సమ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తంగా ఢిల్లీలో కూర్చుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పాత సంస్కృతిని వీడి వివిధ భాషలు, సంస్కృతులకు నిలయమైన దేశంలోని అన్ని మూలలకూ వెళ్లడం ద్వారా ప్రజల దగ్గరవ్వాలన్న ప్రయత్నం అభినందనీయం. తన మొదటి సమావేశాన్ని ఢిల్లీలోనే నిర్వహించి పాత సంస్కృతినే కొనసాగించిన కమలనాథులు తమ తదుపరి సమావేశాన్నైనా ప్రజల చెంత జరుపుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి