లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అరెస్ట్ చేశారు. నిందితుల పెంపుడు చిలుకను విచారించడం ద్వారా కేసును ఛేదించేందుకు గయా పోలీసులు అత్యుత్యాహంతో చిలుకను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులను ట్రోన్ చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని పాట్నాకు చెందిన గురువా పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ కన్హయ్య కుమార్‌కు అక్రమ మద్యం దందాపై సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం అమృత్ మల్లాహ్ ఇంటిపై మంగళవారం రాత్రి దాడి చేశారు. ఐతే పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకునేలోపు అతని కుటుంబ సభ్యులందరూ అప్పటికే సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఐతే వారు పంజరంలో పెంచుకుంటున్న మాట్లాడే చిలుకను మాత్రం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుల అలికిడిని పసిగట్టి చిలుక సూచనలు ఇవ్వడం వల్లే అమృత్ మల్లాహ్ తప్పించుకున్నాడని పోలీసులు భావించారు. దీంతో ఎస్‌ఐ కన్హయ్యకుమార్ చిలుకను పంజరంతో సహా పట్టుకొచ్చి స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అనంతరం యజమాని గురించి చిలుకను ఇలా ప్రశ్నించాడు. ఏయ్ చిలుక అమృత్ మల్లా ఎక్కడికి పోయాడు? నీ యజమాని ఎక్కడ ఉన్నాడు? నిన్ను ఇంట్లో ఒంటరిగా ఎందుకు వదిలేశారు? అని ఎస్‌ఐ కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. వెంటనే చిలుక ‘కటోరే-కటోరే’ అని అరిచింది. యజమాని గురించి ప్రశ్నిస్తే మాత్రం చిలుక మౌనంగా ఉంటోంది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో పోలీసులపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
కాగా బీహార్‌లో మద్యంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత రెండేళ్లలో మద్యం చట్టాన్ని ఉల్లంఘించినందుకు దాదాపు 2.54 లక్షల మందికి పైగా అరెస్టు చేయడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.