ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదులు దాడులకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయమే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. అధునాతన ఐఈడీ దాడులతో రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకే భారత్‌లోని రద్దీ ప్రాంతాలను లష్కరే ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
నవంబర్ 10న కారు బాంబు దాడి
రాజధానిలో ఉగ్రవాదుల కదలికలు కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భీకర కారు బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 24 మందికి పైగా గాయపడ్డారు. DNA పరీక్షల ద్వారా ఈ దాడికి పాల్పడింది ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని తేలింది. సరిగ్గా అదే రోజున ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ల ముసుగులో ఉగ్రవాదులు..
ఈ దర్యాప్తులో వెలుగుచూసిన అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. విద్యావంతులైన వైద్యులు ఉగ్రవాద బాట పట్టడం. ఈ మాడ్యూల్‌లోని కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు దొరికిపోవడంతో భయాందోళనకు గురైన ఉమర్ మొహమ్మద్.. ఆవేశంలో కారు బాంబుతో ఎర్రకోట సమీపంలో విధ్వంసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
భద్రతా సంస్థల హై అలర్ట్
తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలు, మార్కెట్లు మరియు పర్యాటక ప్రాంతాల్లో అనుమానిత కదలికలపై నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
