Road Accidents: ‘వైరస్’ కాదు.. ప్రాణాలు తీస్తున్న ‘వేగం’.. గంటకు 19.. రోజుకు 462 మంది బలి..
Annual report on Road Accidents: ప్రమాదాలు జరగడానికి అతి వేగం, నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో ప్రయాణాలు, రోడ్ ఇంజనీరింగ్ లోపాలు వంటివి కారణాలుగా కనిపిస్తుంటే.. ప్రమాదాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి సేఫ్టీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌లో వినియోగించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండడం, ఎయిర్‌బ్యాగ్స్ వంటివి అన్ని వాహనాల్లో లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి పలు అంశాలతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించే..
ఢిల్లీ, నవంబర్ 01: భారత్‌లో రోడ్డు ప్రమాదాలు లక్షల మందిని బలితీసుకుంటున్నాయి. అంతకు నాలుగింతల మందిని తీవ్రంగా గాయపర్చి అంగవైకల్యాన్ని మిగుల్చుతున్నాయి. రోడ్డు ప్రమాద మరణాల్లో వర్కింగ్ ఏజ్ గ్రూప్ 18-60 ఏళ్ల మధ్య ఉన్నవారే అత్యధికంగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది మరణించగా అందులో 84.4 శాతం మంది 18-60 ఏళ్ల మధ్య వయస్కులేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రాలవారీగా గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధిక జనాభా కల్గిన ఉత్తర్ ప్రదేశ్‌లోనే అత్యధికంగా 22,595 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ విడుదల చేసిన “రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2022” నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అంశాల్లో ‘అతి వేగం’ సింహభాగాన్ని ఆక్రమించింది. మొత్తం ప్రమాదాల్లో 71.2 శాతం అతి వేగం కారణంగానే జరిగాయన్నది నివేదిక సారాంశం. 2022లో జరిగిన మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా, 4,43,366 మందికి పైగా గాయపడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అతి వేగం తర్వాతి స్థానంలో రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ నిలిచింది. వేగంగా ప్రయాణించడానికి ఆస్కారం కల్పిస్తున్న జాతీయ రహదారులే కాదు.. గ్రామీణ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు సైతం ఎక్కువ మంది ప్రాణాలు బలిగొంటున్నాయి. గత ఏడాది జాతీయ రహదారులపై 61,038 మంది మృత్యువాత పడగా, రాష్ట్ర రహదారులపై 41,012 మంది చనిపోయారు. మరో 66,441 మంది ఇతర స్థానిక రహదారులపై జరిగిన ప్రమాదాల్లో మరణించారు.
ఇక ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో పని చేసే వయస్సువారే ఎక్కువ మంది ఉంటున్నారు. మొత్తం మృతుల్లో 66.5 శాతం 18 – 45 ఏళ్ల మధ్య వయస్సు కల్గినవారేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే యువతతో పాటు యావత్ కుటంబం ఆధారపడ్డ వ్యక్తులే ఎక్కువ శాతం ఉన్నారని స్పష్టమవుతోంది. ఈ మరణాలు అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి.
ప్రమాదాల్లో తమిళనాడు.. మరణాల్లో ఉత్తర్‌ప్రదేశ్..
దేశవ్యాప్తంగా గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక ప్రమాదాలు తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. మరణాల్లో మాత్రం ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో అత్యధికంగా 64,105 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. ఆ తర్వాతి స్థానంలో 54,432 ప్రమాదాలతో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. ప్రమాద మరణాల్లో 22,595 మందితో ఉత్తర్‌ప్రదేశ్ మొదటిస్థానంలో, 17,884 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ప్రమాద మరణాల నిష్పత్తిని లెక్కిస్తే.. యూపీలో జరిగే ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 14 మంది చనిపోతుండగా.. తమిళనాడులో జరిగే ప్రతి 100 ప్రమాదాల్లో 10 మంది చనిపోతున్నారు.
దేశవ్యాప్తంగా రోజువారీ సగటు మరణాలను లెక్కిస్తే.. ప్రతి రోజూ దేశంలో 1,264 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వాటిలో 462 మంది మరణిస్తున్నారు. ఇక సగటును గంటకు లెక్కిస్తే.. ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. 19 మంది మరణిస్తున్నారు.
ప్రమాదాలకు అసలు కారణం ఇదే..
ప్రమాదాలు జరగడానికి అతి వేగం, నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో ప్రయాణాలు, రోడ్ ఇంజనీరింగ్ లోపాలు వంటివి కారణాలుగా కనిపిస్తుంటే.. ప్రమాదాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి సేఫ్టీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌లో వినియోగించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండడం, ఎయిర్‌బ్యాగ్స్ వంటివి అన్ని వాహనాల్లో లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి పలు అంశాలతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం అందించే ఎమర్జెన్సీ హెల్త్ అండ్ ట్రామా కేర్ వ్యవస్థ అన్ని చోట్లా అందుబాటులో లేకపోవడం వంటివి దోహదపడుతున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైతే హెలీకాప్టర్లలో క్షతగాత్రులను ట్రామా సెంటర్‌లకు తరలించడం కారణంగా మరణాల రేటును తగ్గించగల్గుతున్నారు. భారత్ ఇంకా ఆ స్థాయికి చేరుకోకపోవడం వల్ల ప్రాణాంతక ‘వైరస్’ కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి