Ayodhya: అయోధ్య వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు

కానీ 2024 జనవరి 22న ఆయనకు ఓ భవ్యమైన మహాద్భుత ఆలయం ప్రారంభమైంది. అత్యంత సుందర రూపంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన జరిగింది. అందుకే అయోధ్య గురించి చెప్పాలంటే జనవరి 22కు ముందు, తర్వాత అని పోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆ రాముడి భక్తుల్లో...

Ayodhya: అయోధ్య వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు
Ayodhya Temple
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Jan 23, 2024 | 8:44 PM

అయోధ్య.. జనవరి 22కు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇక్కడ సరికొత్త శకానికి నాంది పడింది. ఎప్పుడో 1528లో భారతదేశాన్ని దండెత్తిన బాబర్ హయాంలో విధ్వంసానికి గురైన రామజన్మభూమి ఆలయం దాదాపు 500 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్మితమైంది. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో 14 సంవత్సరాలు అయోధ్య నగరానికి దూరంగా వనవాసం చేయాల్సి వచ్చింది. కలియుగంలో రామజన్మభూమి ఆలయం విధ్వంసానికి గురైన తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు పూజలకు నోచుకోలేకపోయిన రామయ్యకు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఓ రేకుల షెడ్డులో పూజలు అందుకోవడం మొదలైంది.

కానీ 2024 జనవరి 22న ఆయనకు ఓ భవ్యమైన మహాద్భుత ఆలయం ప్రారంభమైంది. అత్యంత సుందర రూపంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన జరిగింది. అందుకే అయోధ్య గురించి చెప్పాలంటే జనవరి 22కు ముందు, తర్వాత అని పోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆ రాముడి భక్తుల్లో తీవ్రమైన భావోద్వేగాలకు కారణమైంది. సుమారు 5 వందల సంవత్సరాల ఆలయంలో కొలువైన శ్రీరామచంద్రుడిని దర్శించుకోవాలన్న ఆశ, ఆతృత, తాపత్రాయం వారిలో బలంగా గూడుకట్టుకుంది. నిజానికి ప్రధాన ఆలయం మినహా మిగతా పనులు ఏవీ పూర్తికానప్పటికీ 6 గ్రహాలు అనుకూలిస్తున్న సుముహూర్తాన విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో భక్తుల రద్దీని నియంత్రించే వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయలేకపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రాణప్రతిష్ఠాపన సమయంలో ఎవరూ అయోధ్యకు రావొద్దని, తమ తమ ఇళ్లళ్లోనే ఉండి రామజ్యోతిని వెలిగించాలని.. లేదంటే సమీపంలోని ఆలయంలో పూజలు, భజనలు, కీర్తనల్లో మునిగి తేలాలని అభ్యర్థించారు. ఆయన మాటలను చాలామంది గౌరవించి ఇళ్లకే పరిమితమైనప్పటికీ.. కొందరు మాత్రం అంతటి దివ్యమైన సమయంలో అయోధ్యలో ఉండాల్సిందేనని తీర్మానించుకున్నారు.

స్థానిక అధికార యంత్రాంగం ఆంక్షలు, నిషేధాజ్ఞలను అమలు చేసినప్పటికీ వేటినీ లెక్కచేయకుండా అయోధ్యకు పోటెత్తారు. స్థానికేతరులకు అయోధ్యలోని హోటళ్లలో గదులు ఇవ్వకుండా యంత్రాంగం చర్యలు చేపట్టినప్పటికీ.. వారంతా తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రోడ్లపై, బస్ షెల్టర్లలో, రైల్వే స్టేషన్లలో, నిర్మాణంలో ఉన్న భవంతుల్లో తమతో తెచ్చుకున్న దుప్పట్లు పరచుకుని నింద్రించారు. ఆలయాల నగరి అయోధ్యలో అడుగడుగునా ఉన్న ఆలయాలు, ఆశ్రమాల్లో పెట్టిన ప్రసాదాలు, అన్నదానాల్లో దొరికింది తిన్నారు.

ఎప్పుడెప్పుడు ప్రాణప్రతిష్ఠాపన జరుగుతుందా.. ఎప్పుడెప్పుడు ఆ బాలరాముణ్ణి దర్శించుకుందామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిందో లేదో ఆలయ కారిడార్ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు. చివరకు ట్రస్టు ఆహ్వానం అందుకుని వచ్చిన విశిష్ట అతిథులు, సాధుసంతులు ఆలయం నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. వారంతా తమ వాహనాలను చేరుకోడానికి పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది. అయోధ్య రహదారులు, వీధులన్నీ భక్తులతో పోటెత్తిపోయాయి. ఊహించనిస్థాయిలో వచ్చిపడ్డ భక్తజనాన్ని నియంత్రించడం పోలీస్ యంత్రాంగానికి సాధ్యం కాలేదు. అలాగని భక్తులపై లాఠీఛార్జి వంటి బలప్రయోగం కూడా చేయలేని పరిస్థితి వారిది. తొలిరోజు విశిష్ట అతిథులను సాగనంపిన తర్వాత ఈ మహత్తరకార్యం దిగ్విజయంగా పూర్తిచేయడంలో సహకరించిన అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా దర్శనానికి ఏర్పాట్లు చేస్తే.. వారితో పాటు సామాన్యభక్తజనం దూసుకొచ్చేశారు. గేట్ల వద్ద పోలీసులు నియంత్రించలేకపోయారు. ఆ ప్రయత్నం చేస్తే తోపులాట, తొక్కిసలాటగా మారి ప్రాణాంతకంగా మారేది.

రద్దీని నియంత్రించలేక…!

ప్రధాని మోదీ పిలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రారంభ రద్దీని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు దారితీసే రైళ్లలో 80 శాతం సర్వీసులను ఈ నెల 23 వరకు రద్దు చేసింది. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించినా సరే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అయినా సరే… అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్య చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలవారు కాలినడకన, సైకిళ్లపై వచ్చారు. అలాగని వచ్చినవారంతా సమీప ప్రాంత ప్రజలే అనుకోడానికి వీల్లేదు. అయోధ్యకు రైళ్లు లేకపోయినా లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి నగరాలకు చేరుకుని అక్కణ్ణుంచి రోడ్డుమార్గం ద్వారా అయోధ్యకు చేరుకున్న దూరప్రాంత భక్తులు కూడా ఉన్నారు.

అంతేకాదు, షికాగో, టెక్సస్, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి అమెరికా నగరాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా అక్కడక్కడా కనిపించారు. రామాలయం ప్రారంభమైన తర్వాత ఏడాదికి 5 కోట్ల మంది భక్తులు సందర్శించుకుంటారని ఆలయ వర్గాలు అంచనా వేశాయి. కానీ రామభక్తుల ఆసక్తి చూస్తుంటే.. ఈ అంచనాలను మించి భక్తులు అయోధ్యను సందర్శించేలా ఉన్నారు. అందుకే అధికార యంత్రాంగం రద్దీని నియంత్రించలేక తలపట్టుకుని కూర్చుంది. బుధవారం జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు రద్దీ నియంత్రణపై సమీక్ష కూడా జరపాల్సి వచ్చింది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రస్తుతం రామజన్మభూమి వద్ద ప్రధాన ఆలయం మాత్రమే సిద్ధమైంది. అది కూడా మరికొంత నిర్మాణ పని పూర్తిచేసుకోవాల్సి ఉంది. ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం టికెట్ కౌంటర్లు, క్యూ కాంప్లెక్సులు, ప్రసాదాల కౌంటర్లు, వసతి గృహాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు వంటి ఇతర మౌలిక వసతుల నిర్మాణాలేవీ పూర్తికాలేదు. అయోధ్యకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విమానాశ్రయాన్ని తలపించేలా అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. కానీ ఇవేవీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

అలాగే ప్రైవేట్ హోటళ్లు, కార్పొరేట్ సంస్థలు అయోధ్యలో భారీస్థాయిలో ఆతిథ్య పరిశ్రమకు తగిన నిర్మాణాలు చేపట్టే పనిలో ఉన్నాయి. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న హోటళ్లు రద్దీకి తగినన్ని లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ ప్రయాణాలను ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణ టికెట్లతో పాటు హోటల్ గదులు బుకింగ్ పక్కాగా చేసుకుంటేనే అయోధ్యకు బయల్దేరడం ఉత్తమం. అంతేకాదు, రద్దీలో జరిగే తోపులాటకు కూడా యాత్రికులు సిద్ధపడాల్సిందే. కొద్ది రోజుల్లో రద్దీని నియంత్రించే వ్యవస్థ అందుబాటులోకి రావొచ్చు. కానీ అప్పటి వరకు రద్దీ కారణంగా అసౌకర్యం మాత్రం తప్పదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..