AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు బిగ్ రిలీఫ్.. డేటా షేర్ చేయాలంటే ఇకపై అనుమతి తప్పనిసరి..

వాట్సప్‌కు నేషనల్ కంపెనీ లా అప్లికేట్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది. ఇకపై యూజర్ల డేటా సేకరించాలన్నా లేదా షేరింగ్ చేయాలన్నా యూజర్ల అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకటనల కోసం డేటా తీసుకోవాలన్నా సమ్మతి తప్పనిసరి అని పేర్కొంది.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు బిగ్ రిలీఫ్.. డేటా షేర్ చేయాలంటే ఇకపై అనుమతి తప్పనిసరి..
Whats App
Venkatrao Lella
|

Updated on: Dec 16, 2025 | 3:21 PM

Share

వాట్సప్‌లో యూజర్ల భద్రత, డేటా షేరింగ్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్లికేట్ ట్రిబ్యూనల్(NCLAT) మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యూజర్ల డేటా షేర్ చేయాలంటే వినియోగదారుల సమ్మతి తీసుకోవాలని వాట్సప్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల డేటాపై ఏకపక్ష లేదా ఓపెన్ ఎండ్ హక్కులను వాట్సప్ క్లెయిమ్ చేయలేదని తెలిపింది. యూజర్ల అనుమతి తీసుకున్నాక డేటాను సేకరించే లేదా షేరింగ్ చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఏ డేటాను ఏ ప్రయోజనం కోసం ఎంతకాలం సేకరించాలో నిర్ణయించుకునే హక్కు వినియోగదారులకు ఉంటుందని స్పష్టం చేసింది. ప్రకటనలు లేదా ఇతర వ్యవహారాల కోసం యూజర్ల డేటాను సేకరించేటప్పుడు వాటిని ఉపసంహరించుకునే హక్కు యూజర్లకు ఉంటుందని, యూజర్ల సమ్మతితోనే ఇవి జరగాలని తన ఉత్తర్వుల్లో NCLAT పేర్కొంది.

ప్రకటనలు లేదా ఇతర వాట్సప్‌కు అవసరం లేని ఇతర ప్రయోజనాలకు డేటా సేకరించేటప్పుడు యూజర్ల అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ దశలోనైనా వినియోగదారులకు డేటా షేరింగ్‌ను ఎంచుకునే లేదా నిలిపివేసే సౌకర్యం కల్పించాలని, దీని వల్ల యూజర్ల డేటాకు గోప్యత, రక్షణ ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. దీని వల్ల డేటా దోపిడీ కూడా తగ్గుతుందని, 2021 వాట్సప్ విధానంలో ఇది పెద్ద సమస్యగా ఉందని తెలిపింది. దీనిని ఇప్పుడు మార్చి కొత్త ఆదేశాలు అమలు చేయడానికి వాట్సప్‌కు NCLAT మూడు నెలల సమయమిచ్చింది. NCLAT ఛైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషన్, సభ్యుడు అరుణ్ బరోకాతో కూడిన బెంచ్ ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది.

నవంబర్ 4న NCLAT ఇచ్చిన ఉత్తర్వుల్లో వాట్సప్‌ నిబంధనలు పాటించనందుకు రూ.213 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆ తీర్పులో ప్రకటనలు కానీ ప్రయోజనాల కోసం డేటా షేరింగ్‌కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు లేవు. దీనిపై క్లారిటీ కోరుతూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఇటీవల NCLATలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బెంజ్.. ఏ ప్రయోజనాలకైనా సరే యూజర్ల డేటా షేర్ చేయాలంటే అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది.