CDS Bipin Rawat: భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి.. స్మరించుకున్న ప్రముఖులు

CDS Bipin Rawat: భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి.. స్మరించుకున్న ప్రముఖులు
Cds Bipin Rawat3

భారత తొలి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని కలచివేసింది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ చీఫ్‌తో సిబ్బంది దుర్మరణంపై దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది.

Balaraju Goud

| Edited By: Subhash Goud

Dec 08, 2021 | 11:39 PM


Express Grief to CDS Bipin Rawat: భారత తొలి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని కలచివేసింది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ చీఫ్‌తో సిబ్బంది దుర్మరణంపై దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈరోజు జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో, సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పించారు. రావత్ బృందం ప్రమాదంలో చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా ఇతర సాయుధ దళాల సిబ్బంది హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని మోడీ పేర్కొన్నారు. వీరంతా భారతావనికి అత్యంత శ్రద్ధతో, కర్తవ్య దీక్షతో సేవలందించారని కొనియాడారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

అలాగే, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ భావోద్వేగం నిండిన పదాలను రాసుకొచ్చారు.. బిపిన్ రావత్ అసలు సిసలు దేశభక్తుడని కొనియాడారు. జనరల్ రావత్ గొప్ప ప్రతిభాపాటవాలుగల సైనికుడని, భారత సాయుధ దళాలను, భద్రతా ఉపకరణాలను ఆధునికీకరించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారని మోడీ గుర్తుచేశారు. దేశానికి సంబంధించి వ్యూహాత్మక అంశాల పట్ల జనరల్ రావత్ కు గొప్ప పరిజ్ఞానం ఉందని, ఆయన దృక్పథం, ఆలోచనలు అసాధారణమైనవని ప్రధాని పేర్కొన్నారు. జనరల్ ఇప్పుడు దివంగతులు కావడం తనను తీవ్రంగా కలచివేసిందని, తాను తీవ్రంగా విచారిస్తున్నానని మోదీ తెలిపారు.

”సీడీఎస్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులిక అకాల మ‌ర‌ణం తీవ్రంగా బాధించింది. అత్యంత ధైర్య సాహ‌సాలు చూపించే బిడ్డ‌ను ఈ దేశం కోల్పోయింది. అత్యంత శౌర్య ప్ర‌తాపాల‌తో, హీరోయిజంతో ఆయ‌న మాతృభూమికి సేవ‌లందించారు. ఈ లక్ష‌ణాల‌తో ఆయ‌న గుర్తింపు పొందారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను. విధి నిర్వ‌హ‌ణ‌లో మృతి చెందిన వారి కుటుంబాల‌కు కూడా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను” అంటూ భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

”హెలికాప్ట‌ర్ దుర్ఘ‌ట‌న‌లో సీడీఎస్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య‌, ఇతర సిబ్బంది మృతి చెందార‌న్న వార్త ఎంతో షాక్‌కు గురి చేసింది. ఈ విష‌యంపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌తో మాట్లాడా. నా సానుభూతిని వ్య‌క్తం చేశాను. దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నా. ” అంటూ భారత ఉప రాష్ట్రపతి వెంక‌య్య నాయుడు దిగ్ర్భాంతి తెలియజేశారు.

రావత్ మృతిపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర సంతాపం తెలిపారు. తమిళనాడులో ఈరోజు జరిగిన అత్యంత దురదృష్టకర హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మరియు మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాల గురించి నా హృదయం అల్లాడుతోందన్నారు. ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్ నాథ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

”అత్యంత ధైర్య సాహ‌సాల‌తో విధులు నిర్వ‌ర్తించిన వారిలో బిపిన్ రావ‌త్ ఒక‌రు. మాతృభూమికి ప‌రిపూర్ణ శ్ర‌ద్ధాస‌క్తుల‌తో సేవ‌లందించారు. ఆయ‌న చేసిన సేవ‌, త్యాగం మాటల్లో చెప్ప‌లేను. కెప్టెన్ వ‌రుణ్ సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నా” అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బిపిన్ రావత్ మృతిపట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, అతని భార్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధకరం. వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది తీవ్ర విషాదం, ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక సంతాపం. ఈ దుఃఖంలో భారతదేశం ఐక్యంగా ఉందామని. అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu