Nataraja Swamy Temple: నటరాజస్వామి ఆలయంలో మళ్లీ వివాదం.. కనక సభలోకి దూసుకెళ్లిన భక్తులు, అధికారులు..
తమిళనాడు చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో మళ్లీ వివాదం మొదలైంది. ఈసారి దర్శనం విషయంలో గొడవలు.. ప్రభుత్వం జోక్యం చేసుకునే దాకా వెళ్లాయి. కనకసభ ప్రాంతం నుంచి దర్శనానికి సామాన్య భక్తులకి అనుమతి లేదన్నది దీక్షితులు చెబుతున్న మాట.
తమిళనాడు చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో మళ్లీ వివాదం మొదలైంది. ఈసారి దర్శనం విషయంలో గొడవలు.. ప్రభుత్వం జోక్యం చేసుకునే దాకా వెళ్లాయి. కనకసభ ప్రాంతం నుంచి దర్శనానికి సామాన్య భక్తులకి అనుమతి లేదన్నది దీక్షితులు చెబుతున్న మాట. కానీ భక్తులు మాత్రం తమకు దర్శనం ఎందుకు ఉండదని.. తాము అంటరాని వాళ్లమా అంటూ నిలదీశారు. అంతటితో ఆగకుండా పోలీసులు, దేవాదాయ శాఖ అధికారుల సాయంతో కనకసభ ప్రాంతం నుంచి నటరాజ స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో దీక్షితులంతా కలిసి ఆలయం లోపలికి వెళ్లి పోలీసుల్ని, అధికారుల్ని, భక్తుల్ని బయటకు పంపించేశారు.
పోలీసులు, అధికారుల తీరుపై దీక్షితులు మండిపడ్డారు. మహా పాపానికి ఒడిగడుతున్నారని.. ఇదేం మాత్రం క్షమించరానిదన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఆలయానికి చేరుకుని దీక్షితులు వర్గానికి మద్దతుగా ఆందోళనకు దిగారు. ఆలయాచారాలను ప్రతీ ఒక్కరు పాటించాలని నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. భక్తుల మనోభావాలను దీక్షితులు దెబ్బతీస్తున్నారని.. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
అనుకూల వ్యతిరేక నినాదాలతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయి జారకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మాత్రం దర్శనానికి అందరికీ అనుమతివ్వాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే ఆలయంలో గతంలో సంపద లెక్కింపు విషయంలోనూ గొడవలు జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..