Mukul Roy Appointed PAC Chairman: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసినా.. రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి టెక్నికల్ షాక్ ఇస్తూ వ్యూహరచన చేశారు. బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తృణముల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్‌కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని అప్పజెప్పారు. శుక్రవారం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోగా.. ఆమె నిర్ణయానికి స్పీకర్ బిమాన్ బెనర్జీ ఆమోదముద్ర వేశారు.
ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ముందు సభలో ఏ కమిటీకి బీజేపీ నాయకత్వం వహించదని వారు ప్రకటిస్తూ.. మమతా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు కేటాయిస్తారన్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం బీజేపీ ఆరుగురి పేర్లను సూచించినా.. దీదీ మాత్రం ముకుల్ రాయ్‌నే ఆ పదవిలో నియమించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా.. ముకుల్ రాయ్ టీఎంసీలో చేరినా.. ఇప్పటికీ ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. దీనిపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ముకుల్ రాయ్ టీఎంసీలో చేరినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనను పీఏసీ చైర్మన్‌గా నియమించారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ సువేందు మండిపడ్డారు.
Also Read: