Modi govt 8 years: 8 ఎళ్ల పాలనలో ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత శక్తివంతమైన నిర్ణయాలివే..!

|

May 26, 2022 | 5:31 PM

Modi govt 8 years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రధానులందరిలోనూ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా గుర్తింపు పొందారు

Modi govt 8 years: 8 ఎళ్ల పాలనలో ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత శక్తివంతమైన నిర్ణయాలివే..!
Pm Modi
Follow us on

Modi govt 8 years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రధానులందరిలోనూ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా గుర్తింపు పొందారు నరేంద్ర మోదీ. 2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిననాటి నుంచి నేటి వరకు అంటే ఈ ఎనిమిదేళ్ల పాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో వేగం, నిర్ణయాల అమల్లో కఠినత్వం.. వెరసి భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోదీ. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ సహా అనేక నిర్ణయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

1. కరెన్సీ నోట్ల రద్దు…
ప్రధానిగా నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో మొదటిది పెద్ద నోట్ల రద్దు. నవంబర్ 8, 2016న అకస్మాత్తుగా రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు నల్లధనం, తీవ్రవాదులకు నిధుల సమీకరణను నిలిపివేయడం, అవినీతిని నిర్మూలించే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘దీపావళి సందర్భంగా మీరు మీ పరిసరాలను శుభ్రం చేసినట్లే, మన దేశాన్ని శుద్ధి చేసే ఈ మహత్తర నిర్ణయానికి మీ వంతు సహకారం అందించమని మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను.’’ అని జాతినుద్దేశించి ప్రధాని మోదీ అన్నారు.

2. పాకిస్థాన్ పర్యటన…
2015లో పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల చర్చల సందర్భంగా అప్పటి పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో షెడ్యూల్‌ లేకుండా భేటీ అయిన కొన్ని వారాల తర్వాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌లో ఆకస్మిక పర్యటించారు. 10 ఏళ్ల తరువాత భారత ప్రధాని పాకిస్తాన్‌కు వెళ్లడం అదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆకస్మిక పర్యటన నవాబ్ షరీఫ్ 66వ పుట్టిన రోజు, అటల్ బిహారీ వాజ్‌పెయి 91వ పుట్టిన రోజు సందర్భంగా జరిగింది. ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనపై అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసలు కురిపించారు. రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం అంటూ మోదీని పర్యటనను కొనియాడారు.

ఇవి కూడా చదవండి

3. ఆర్టికల్ 370 రద్దు…
2019 లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎళ్ల తరబడి నలుగుతున్న జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రధానంగా భావించిన నరేంద్ర మోదీ సర్కార్.. జమ్మూ కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను ఉపసంహరించుకున్నారు. ఇందులో భాగంగా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం.. యావత్ ప్రపంచాన్నే షేక్ చేసింది. కశ్మీర్ వివాదం పాకిస్తాన్, భారత్ మధ్య నిత్య ఘర్షణలకు కారణం అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన షాకింగ్ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ వివాదానికి చెక్ పెట్టారు ప్రధాని మోదీ. అయితే, కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన జమ్మూకశ్మీర్ ఎక్కువ కాలం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండబోదని రాజ్యసభలో స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దానికి త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు.

4. బాలాకోట్ వైమానిక దాడి..
2019లో జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థ పుల్వామాలో భారత సైనికులపై దాడి చేయడంపై యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ ఘటనలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో.. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని యావత్ దేశ ప్రజల ముక్తకంఠంతో నినదించారు. ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదులకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. ఫిబ్రవరి 26, 2109న భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జేఎం బేస్ క్యాంపుపై వైమానిక దాడులు చేసింది. ఆ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు హతమైనట్లు మీడియా సంస్థలు పేర్కొన్నారు. వారిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వారు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

5. వ్యవసాయ చట్టాల రద్దు…
వ్యవసాయాన్ని లాభిసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 3 నూతన వ్యవసాయ సాగు చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు దేశంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. అయితే, ఈ చట్టాలు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేవిగా ఉన్నాయని, రైతులకు నష్టమే తప్ప ఉపయోగం లేదంటూ రైతులు తీవ్ర ఆందోళనలు చేశారు. దాదాపు సంవత్సరం పాటు రైతులు తమ నిరసనలను వ్యక్తం చేశారు. రైతు నిరసనలు.. ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వంతో రైతులు ఎన్నిసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో కేంద్రమే వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

6. భూ సంస్కరణలు..
భూ సంస్కరణలకు సంబంధించి తీసుకువచ్చిన చట్టాలు కూడా దేశంలో సంచలనం సృష్టించాయి. ఆ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరకు ఆ చట్టాలు రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించి.. ఆ మేరకు ప్రకటించింది.

7. మిషన్ శక్తి ప్రకటన..
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు భారత ప్రభుత్వం మిషన్ శక్తిని చేపట్టాయని, ఇది స్వదేశీ సాంకేతికతతో దేశంలోనే మొట్టమొదటి విజయవంతమైన ఉపగ్రహ నిరోధక క్షిపణి ప్రయోగం అని ప్రధాని మోదీ మార్చి 27, 2019న ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో రష్యా, యూఎస్, చైనా సరసన భారత్ నిలిచింది. శాస్త్రవేత్తల కృషి పట్ల ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

8. ఉచిత కరోనా వ్యాక్సీన్..
కరోనా సెకండ్ వేవ్ భారత దేశాన్ని షేక్ చేసింది. కరోనా కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక, బెడ్స్ ఉన్నా ఆక్సీజన్ అందుబాటులోకి లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధికి, ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. జూన్ 21, 2021 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకాలను ఉచితంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం.