
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 జిల్లా పరిషత్, 9730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో పలు చోట్ట హింసాత్మక సంఘటనలు జరిగాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతోన్నా హింస జరగడం గమనార్హం.
శనివారం జరిగిన హింసాత్మక సంఘటనలో పలువురు హత్యకు గురయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలు చనిపోయారు. కూచ్ బెహార్ ప్రాంతంలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ని దుండగులు కాల్చి చంపారు. ఇక దాడుల్లో గాయపడ్డ సీపీఎం కార్యకర్త చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మల్దా జిల్లాలో జరిగి బాంబు దాడిలో టీఎంసీ కార్యకర్త ఒకరు మరణించాడు. 24 పార్‌గనాస్ జిల్లాలో అబ్దుల్లా అనే బూత్ ఏజెంట్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనకాల టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్ల మీదికొచ్చిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మున్నా బిబిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీల మధ్య తీవ్ర హింస చెలరేగింది.
ఇక పలుచోట్ల పోలింగ్ బూత్‌లను ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పుపెట్టారు. 24 పార్‌గనాస్‌లో ఉన్న పోలింగ్ బూత్‌కు వెళ్లే సమయంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే నందిగ్రామ్ బ్లాక్‌లో ప్రజలు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలను వెనక్కి పంపించేయాలంటూ డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..