Manipur Horror: ఈశాన్య రాష్ట్రంలో తగలబడుతున్న మానవత్వం.. హక్కులు లేని అరాచకత్వం
మే2న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన తర్వాత భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయినా బహిరంగంగా నిస్సిగ్గుగా మహిళల పట్ల ఇలా ఎలా ప్రవర్తించగలిగారనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇంతటి ఉన్మాదం, దారుణం జరిగినా చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు తేలిగ్గా తీసుకున్నారనేది హక్కుల సంఘాలు ఆందోళన.

సరిహద్దుల్లో యుద్ధాన్ని ఆపగలుగుతున్నాం.. శత్రు దేశాలకు స్నేహహస్తం అందిస్తున్నాం.. కానీ సాటి మనిషిని మాత్రం మనిషిగా చూడలేకపోతున్నాం. మణిపూర్ ఘటన ఇందుకు ఓ ప్రత్యక్ష సాక్ష్యం. ఇద్దరు మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. అత్యాధునిక కాలంలో రాతియుగపు ఆలోచనలకు అద్దం పట్టిన సంఘటన ఇది. ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతకులకు కఠిన శిక్ష వేస్తామని పాలకులు ప్రకటించారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ చెబుతున్నట్టు ఉరిశిక్ష పడుతుందా? లేదా? పక్కనపెడితే ఏ పురాణాల్లోనూ కనిపించని, వినిపించని అత్యంత హేయమైన ఈ వికృతక్రీడకు అవకాశం ఇచ్చింది ఎవరు అనేది చర్చ జరగాలి.
ఎవరిది బాధ్యత..!
మే2న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన తర్వాత భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయినా బహిరంగంగా నిస్సిగ్గుగా మహిళల పట్ల ఇలా ఎలా ప్రవర్తించగలిగారనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇంతటి ఉన్మాదం, దారుణం జరిగినా చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు తేలిగ్గా తీసుకున్నారనేది హక్కుల సంఘాలు ఆందోళన. నిర్భయ ఘటనలా ఇదేమీ అర్ధరాత్రి బస్సులో జరగలేదు. చీకటి గదిలో నిర్బంధించి మరీ దారుణానికి ఒడిగట్టలేదు. అందరి ముందు పట్టపగలు వందల మంది పురుషులు ఇద్దరు మహిళలను నగ్నంగా పరేడ్ చేస్తుంటే కనీసం ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. తెలిసి కూడా పోలీసులు కేసు పెట్టలేదు. వీడియో వైరల్ అయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది అంటే అర్ధం ఏంటి? ఈ పాపం తెలిసి ఆపలేని యంత్రాగానిదా? ఏమీ పట్టనట్టు మొద్దునిద్రలో ఉన్న స్థానిక ప్రభుత్వానిదా..? ఘటన జరిగిన తర్వాత కఠిన చర్యలు గురించి మాట్లాడుతున్న సీఎం బీరేన్ సింగ్ అల్లర్లు మొదలైన తర్వాత చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది అంగీకరించాల్సిన సత్యం.

Manipur Horror Incident
విపత్తులతో రాజకీయం..
బడుగుబలహీన వర్గాలు, దళితులు, ఎస్టీలు ఇప్పటికీ చాలాప్రాంతాల్లో అంటరానివారిగానే బతుకులీడుస్తున్నారు. వివక్షదాడులకు బలి అవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నా సమానహక్కులను, సమన్యాయం ఆయా వర్గాలకు అందనిద్రాక్షగానే మారింది. పీడిత వర్గాల హక్కులు కాలరాస్తూనే ఉన్నారు. అస్యృస్యతను అరికట్టేందుకు కలిసికట్టుగా నడవాల్సిన రాజకీయ పార్టీలు వాటిని ఆలంబనగా చేసుకుని అధికారపీఠాలు దక్కించుకుంటున్నాయి. వారిలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యపద్దతి, చిత్తశుద్ది కించిత్ కనిపించడం లేదు. ఓ ఘటన జరిగితే రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాయి పార్టీలు. తమకు అనుకూలంగా మలుచుకుని దేశప్రతిష్టను పణంగా పెడుతున్నాయి కూడా. మధ్యప్రదేశ్‌లో మూత్ర విసర్జన ఘటన అయినా, మణిపూర్ అల్లర్లు అయినా రాజకీయపార్టీలకు సాధనాలవుతున్నాయి కానీ బాధితులకు న్యాయం జరగడం లేదు. పీడితులవుతున్న వర్గాలకు 75 ఏళ్ల భారతంలో భరోసా ఇవ్వలేకపోయాయి ప్రభుత్వాలు అవి చేసిన చట్టాలు. బాధితుల వైపు నుంచి, దేశం కోణంలో పాలకులు వీటిని చూడనంతవరకూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. భారత కీర్తిపతాకంపై మాయనిమచ్చలుగా మిగులుతూనే ఉంటాయి.
యథా నాయకా… తథా ప్రజా..!
” ఐక్యరాజ్యసమితి దేశ ప్రజలం అయిన మేమందరం మానవహక్కులకు కట్టుబడి ఉంటాం. మనిషి విలువ, గౌరవం కాపాడటంతో పాటు స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయని విశ్వసిస్తున్నాం. మానవులందరూ సమాన స్వేచ్ఛ, గౌరవం మరియు హక్కులతో జన్మించారు. ప్రతిఒక్కరూ హక్కులు మరియు స్వేచ్ఛను కలిగి ఉంటారు.”
ఈ డిక్లరేషన్ చేసుకుని సంతకం చేసిన దేశంలో ఉన్న మనం తలదించుకోవాల్సిన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్టు మణిపూర్ ఘటన 140 కోట్ల ప్రజలందరికీ సిగ్గుచేటు. ఈ ఘటనలకు బాధ్యత కేవలం రాజకీయ పార్టీలది కాదు. ప్రజలకు కూడా వందశాతం భాగస్వామ్యం ఉంది. విద్వేషాలు నింపుతూ పబ్బం గడుపుకునే నాయకులను పదేపదే చట్టసభలకు పంపడం జనం తప్పే. వారే నాయకులుగా, పాలకులుగా మారి జనాల మధ్య చిచ్చు పెడుతున్నారు. తీవ్రవాదాన్ని ఆయుధాలతో అణిచివేయవచ్చు. కానీ పౌరులమధ్య జరిగే అంతర్యుద్ధానికి తుపాకులు పరిష్కారం కాదు. అంతా ఒక్కటే అని భావన కల్పించడం ద్వారానే సాధ్యమవుతుంది. అది పాలకులు చేయాల్సిన పని. వాళ్లు తమ పనిచేయాలంటే కావాల్సింది సరైన నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం. అందుకే మళ్లీ మళ్లీ మణిపూర్ వంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే జనాలు మేలుకోవాలి. జనం మేలు కోరే నాయకుడిని ఎన్నుకోవాలి.
నాణానికి రెండో కోణం…
ఇటీవల అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. ప్రపంచంలో భారతదేశం పాత్ర వేగంగా మారుతోందన్నారు. G20కి అధ్యక్షత వహిస్తోందని.. ఇది దేశ సమర్ధతను చూసిస్తుందని, ఏ అంశాన్ని తీసుకున్నా ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుందన్నారు. ఆయన మాటలు అతిశయోక్తి లేకపోవచ్చు. అంతా నిజాలే కావొచ్చు.. కానీ మణిపూర్ ఘటన తర్వాత ప్రపంచమంతా మన దేశాన్ని మరో కోణంలో చూడటం మొదలుపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనలు వల్ల వచ్చిన కీర్తి మణిపూర్ హింసతో మరుగునపడేలా చేసింది. ప్రపంచంలో 3వ ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశం నాణానికి ఒక కోణం అయితే… నార్త్ ఈస్ట్ ఘటనలు రెండో కోణంగా మారాయి. డెవలప్ మెంట్ అనేది కేవలం జీడీపీలు, తలసరి ఆదాయాలు కాకుండా మానవహక్కులు, పర్యావరణం వంటి అంశాలతో సమ్మిళితమై ఉంటుంది. అగ్రదేశంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
అత్యంత పురాతన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో 2020 మేలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు మాయనిమచ్చగా మిగిలింది. ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. దీన్నుంచి ఇంకా కోలుకోలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌కు కూడా మణిపూర్ ఘటనలు, సామూహిక హత్యలు, ఇస్లాంపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చెరిగిపోని చేదుగుర్తులుగా నిలిచిపోతాయి. వీటిని నివారించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన ఓ ప్రమాద హెచ్చరికగా భావించాలి. సామూహిక హత్యలు, అత్యాచారాలు, వివక్ష దాడులు లేని స్వేచ్ఛాయుత, సమాన హక్కులు కలిగిన భారతం సాకారం అయితేనే అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని గమనించాలి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు దూసుకువెళుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేస్తున్న పరిస్థితి ఓవైపు ఉంటే, మణిపూర్ లాంటి ఘటనలు యావత్ మానవాళి మరోవిధంగా మనల్ని చూసేంత ప్రమాదంలో నెట్టేసింది.
”ఘటనలు జరగడం దురదృష్టకరం.. కానీ వాటిని ఎలా చూస్తున్నాం, ఎలా అరికట్టాం అన్నది మనదేశ ప్రతిష్టను, దేశప్రజల్లోని రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలియజేస్తుంది.”
-వ్యూపాయింట్ బై రజనీకాంత్ వెల్లెలచెరువు