‘మతపరమైన పచ్చబొట్టు’ ఉందనే కారణంగా ఓ యువకుడు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతడు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. కుడిచేతి భాగంలో మతపరమైన పచ్చబొట్టు ఉందనే కారణంగా కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ తదితర బలగాల్లో ప్రవేశానికి నిరాకరించారు. అనర్హుడిగా ప్రకటితుడైన ఓ యువకుడు అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ యువకుడు దాఖలు చేసిన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారించింది.
వైద్యపరీక్షలో తనకు ఎలాంటి లోపాలూ లేవని తేలిందనీ, చేతి మీది పచ్చబొట్టును మైనర్ లేజర్ సర్జరీ ద్వారా టాటూను తొలగించుకుంటానని పిటిషనర్ కోర్టుకు విన్నవించాడు. అభ్యర్థి అభ్యర్థనను విన్న ఢిల్లీ హైకోర్టు మతపరమైన పచ్చబొట్టు తొలగించిన తర్వాత రిక్రూట్‌మెంట్ కోసం ఆ వ్యక్తి హాజరుకావచ్చని పేర్కొంది. అయితే, సెల్యూట్ చేయడానికి ఉపయోగించే కుడిచేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకొని కొత్త వైద్యపరీక్షలకు బోర్డు ముందు హాజరుకావడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు కేసును ముగించింది. నియామకానికి అర్హుడని వైద్యబోర్డు నిర్ధరిస్తే, చట్టానికి అనుగుణంగా అతడిని రిక్రూట్ చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
అభ్యర్థి తన టాటూ కారణంగా 2021 అస్సాం రైఫిల్స్ పరీక్షలో CAPF, NIA, SSF , రైఫిల్‌మ్యాన్ GDలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పదవికి అనర్హుడని పేర్కొన్నారు. దీంతో ఆ యువకుడు ఢిల్లీ హైకోర్టుని న్యాయం చేయమంటూ ఆశ్రయించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..