Maharastra: భర్తకు కాలేయ దానం చేసిన భార్య, మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఇద్దరూ మృతి
భర్త కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తన భర్త ఆరోగ్యం కోసం భార్య తన కాలేయాన్ని దానం చేసింది. అయితే ఆపరేషన్ తర్వాత భార్య భర్తలు ఇద్దరూ మరణించారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అవయవ మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి సమర్పించాలని అసపత్రి యాజమాన్యానికి ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు.

కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్న తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఒక భార్య ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. తన కాలేయాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఆపరేషన్ చేసి భార్య కాలేయంలో కొంత భాగాన్ని భర్తకు పెట్టారు. అయితే ఇలా అవయవ మార్పిడి అపర్షన్ జరిగిన రెండు రోజుల్లో భర్త మరణించాడు. కొన్ని రోజుల తర్వాత భార్య కూడా తుది శ్వాస విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన పూణే లో చోటు చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరవాత మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసిందని ఒక అధికారి తెలిపారు.
సహ్యాద్రి ఆసుపత్రి అవయవ మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రికి నోటీసు జారీ చేశామని.. అవయవ గ్రహీత, దాత వివరాలను వారి వీడియో రికార్డింగ్‌లతో పాటు పంపాలని కోరినట్లు ఆయన తెలిపారు.
రోగిని బాపు కోమ్కర్ గా గుర్తించారు. అతని భార్య కామిని.. ఆగస్టు 15న ఆసుపత్రిలో కాలేయం మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. కాలేయం మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించింది. ఆగస్టు 17న ఆయన మరణించారు. ఆగస్టు 21న కామిని ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతూ మరణించింది. వైద్య నిర్లక్ష్యం వల్లే ఈ మరణం జరిగిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
“ప్రామాణిక వైద్య ప్రోటోకాల్స్ ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి తెలిపింది. “మేము దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాము. ఈ విషయంపై సమగ్ర సమీక్ష జరిగేలా అవసరమైన పూర్తి సమాచారం, మద్దతును అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని .. ఆరోగ్య శాఖ జారీ చేసిన నోటీసు అందినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. బాపుకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. శస్త్రచికిత్స వల్ల కలిగే నష్టాల గురించి కుటుంబ సభ్యులకు, కాలేయ దాతకు ముందుగానే అన్ని విషయాలను తెలిపామని.. అందరి అంగీకారం తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




