Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..
Lucknow: ఉన్నట్లుండి గ్యాస్ట్రోఎంటెరిటిస్ బాధితులు పెరగడానికి కారణాలేంటో కనుక్కునే పనిలో పడ్డారు. కాగా తాగు నీరు కలుషితం కావడం, ఫుడ్‌పాయిజనింగ్ కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Lucknow: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో గత రెండు వారాలుగా గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలందరూ అల్సర్, ఇన్‌ఫ్లమేషన్, అతిసారం, వాంతులు, విరేచనాలు, తేలికపాటి జ్వరాలతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బాధితులతో అక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నా్యి. ఈక్రమంలో అక్కడి అధికారులు అప్రమత్తయ్యారు. ఉన్నట్లుండి గ్యాస్ట్రోఎంటెరిటిస్ బాధితులు పెరగడానికి కారణాలేంటో కనుక్కునే పనిలో పడ్డారు. కాగా తాగు నీరు కలుషితం కావడం, ఫుడ్‌పాయిజనింగ్ కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రజలు కొన్ని రోజుల పాటు కాచి వడగాచిన గోరువెచ్చని నీళ్లు తాగాలని, నిల్వ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. కాగా ఈ పరిస్థితిపై లక్నోకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ సోమాని న్యూస్ 9తో మాట్లాడారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ (Gastroenteritis) అనేది వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధేనని, పెద్దగా భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.
రెండు రోజుల్లోనే..
‘సాధారణంగా వర్షాకాలంలో గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు కనిపిస్తాయి. కానీ ఈసారి వేసవిలో కూడా ఈ కేసులు వస్తున్నాయి. రంజాన్ మాసంలో చాలామంది ఉపవాసం పాటించారు. వారు చాలా సమయం పాటు తినకుండా ఉన్నారు. అదే సమయంలో ఇఫ్తార్ సమయంలో నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్యలు తలెత్తాయి. అయితే ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయమేమీ కాదు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది. రోజూ 10-12 మంది స్టమక్ ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారిలో కూడా తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు’ అని డాక్టర్ సోమాని తెలిపారు.
గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటే..
గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది తిమ్మిరి, వికారం, వాంతులు , జ్వరంతో కూడిన ఒక విధమైన ప్రేగు సంక్రమణం. దీనిని స్టమక్ బగ్ లేదా స్టమక్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. వైరస్, బ్యాక్టీరియా లాంటి పరాన్నజీవుల కారణంగా ఇది వ్యాప్తి చెందుతుంది. కడుపు, ప్లేగుల్లో ఇన్‌ఫ్లమేషన్, అతిసారం దీని ప్రధాన లక్షణాలు. ఇక లక్నోలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ప్రధాన కారణమేంటంటే.. కలుషిత ఆహారం, నీరు. ‘వీధి వ్యాపారుల్లో చాలామంది బకెట్లలో నిల్వ చేసిన నీటినే ఉపయోగిస్తున్నారు. ఇది కలుషితమైనది. పాత్రలు కడిగేందుకు, ఇతర అవసరాలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. ఇదే స్టమక్ ఫ్లూకు ఎక్కువగా కారణమవుతోంది. ఇక నగరంలో వడగాల్పులు వీస్తున్నాయి. దీనివల్ల నిల్వచేసిన ఆహారం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సీజన్‌లో ప్రజలు బయటి ఆహారానికి దూరంగా ఉండడం మేలు . తప్పనిసరిగా పరిశుభ్రమైన, నీటినే తాగాలి. ప్రయాణాలు చేసినా, బయటకు వెళ్లినా వీలైనంత వరకు ఇంటి నుంచే తాగునీటిని తీసుకెళ్లాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారాన్ని తినాలి’ అని సోమాని సూచించారు.
గ్యాస్ట్రో ఎంటెరిటిస్ సాధారణ లక్షణాలివే..
*కడుపు నొప్పి లేదా తిమ్మిరి
*అతిసారం
*వికారం, వాంతులు
*తేలిక పాటి జ్వరం
*ఒళ్లు నొప్పులు
*విపరీతమైన చలి, వేడి
*అజీర్ణం
*ఆకలి లేకపోవడం
*నీరసం, బలహీనత
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also read: