
దేశంలో ఎన్నికల పండగ ముగిసింది. లోక్‌సభ ఏడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో.. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఇక మిగిలింది ఫలితాలే. జూన్ 4న ఎన్నికల ఫలితాల వైపై ఇక అందరి చూపు మళ్లింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్‌ను నిర్వహించింది. చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినిహా అంతా సవ్యంగానే సాగింది. ఇక చివరి విడత 7వ దశ పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరిగింది.
పంజాబ్ 13, బెంగాల్ 9, బిహార్ 8, ఝార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 102 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 66.14 శాతం పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్ లో 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగగా.. 66.71 శాతం పోలింగ్ నమోదైంది. మూడో విడతలో మే 7న 94 స్థానాలకు, నాలుగో విడతలో మే 13న 96 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 65, 69 శాతం పోలింగ్ నమోదైంది. మే 20న 49 స్థానాలకు ఐదో విడత, మే 25న 57 స్థానాలకు ఆరో విడత ఎన్నికలయ్యాయి. ఐదో విడతలో 62శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఆరో విడతలో 62శాతం నమోదైంది. ఇక చివరి విడతలో దాదాపు 60 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తంగా 545 స్థానాలకు విజయవంతంగా పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. ఈవీఎంలలో ఉన్న నాయకుల భవిష్యత్తు తేలాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..