కేరళ ఆరోగ్య మంత్రి శైలజకు అంతర్జాతీయ ప్రశంసలు

కబుర్లతో కాలక్షేపం చేయలేదామె! కత్తులు పుచ్చుకుని కదనరంగాన యుద్ధం చేసినట్టుగా బిల్డప్‌ ఇవ్వలేదామె! కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఏం చేయాలో ఆలోచించించారు.. అందుకు తగినట్టుగా కార్యాచరణను రూపొందించారు.. అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు.. ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశంసలు అందుకుంటున్నారు

కేరళ ఆరోగ్య మంత్రి శైలజకు అంతర్జాతీయ ప్రశంసలు
Follow us
Balu

|

Updated on: Sep 03, 2020 | 12:41 PM

ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన పోల్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన శైలజ

కబుర్లతో కాలక్షేపం చేయలేదామె! కత్తులు పుచ్చుకుని కదనరంగాన యుద్ధం చేసినట్టుగా బిల్డప్‌ ఇవ్వలేదామె! కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఏం చేయాలో ఆలోచించించారు.. అందుకు తగినట్టుగా కార్యాచరణను రూపొందించారు.. అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు.. ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.. ఆమె అచ్చంగా మన భారతీయురాలు.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కే.కే.శైలజ.. మంత్రిగా కంటే ఆమె శైలజా టీచర్‌గానే సుప్రసిద్ధురాలు.. ప్రపంచంలోకల్లా గొప్ప ఆలోచనపరులలో ఆమె నిలిచింది.. బ్రిటన్‌లో ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ శైలజకు ఈ ఘనతను కట్టబెట్టింది.. కరోనా సంక్షోభం సందర్భంగా ప్రపంచంలో బెస్ట్‌ థింకర్స్‌ ఎవరు అన్నదానిపై సర్వే చేసిందా మీడియా సంస్థ.. సర్వే అంటే ఓ రకంగా పోల్‌ అన్నమాట! ఇందులో లక్షల మంది పాల్గొన్నారు.. ఆ పోల్‌లో శైలజ విజయం సాధించారు.. నంబర్‌వన్‌గా నిలిచారు.. ఇది మనకు సంతోషదాయకమే కదా! కరోనా కట్టడిలో విజయం సాధించి, దేశం నుంచే ఆ వైరస్‌ను తరిమికొట్టారన్న ప్రశంసలను అందుకున్న న్యూజీలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్‌ రెండో స్థానంలో నిలవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. టాప్‌ -50లో శైలజ మొదటి స్థానంలో నిలవడమంటే మాటలు కాదుగా! ప్రపంచమే ఆమె ఆలోచనావిధానానికి జేజేలు పలకడం అసామన్యమే కదా! అద్భుతమే కదా! అనందదాయకమే కదా!

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో శైలజ ఏ మాత్రం అలసత్వాన్ని కనబర్చలేదు.. మాటలతో సమయాన్ని వృధా చేయలేదు.. రాజకీయాల్లోకి రాకముందు ఆమె స్కూల్‌ టీచర్‌, అందులోనూ సీపీఎం యాక్టివిస్టు.. అందుకే క్రమశిక్షణతో శ్రమించారు.. ఏం కేరళలో కరోనా లేదా అని ప్రశ్నించవచ్చు.. అక్కడా ఉంది…అక్కడా మరణాలు ఉన్నాయి.. అక్కడా వ్యాప్తి చెందుతూ వుంది.. కానీ ఆరోగ్యశాఖ మంత్రిగా శైలజ బాధ్యతనెరిగి ప్రవర్తించారు.. ఇప్పుడే కాదు.. కొన్నేళ్ల కిందట నిఫా వైరస్‌ ప్రబలినప్పుడు కూడా ఇలాగే కష్టపడ్డారు.. ఆ వైరస్‌ను నియంత్రించగలిగారు..

ఇప్పుడు కరోనా వైరస్‌పై శైలజ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. నిజాయితీగా పనిచేస్తున్నారు.. అందుకే రైట్‌ పర్సన్‌ ఇన్‌ రైట్‌ ప్లేస్‌ అంటూ ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ ప్రశంసించింది. ఇన్ని టెస్ట్‌లు చేశాం.. ఇన్ని పడకలు పెట్టాం.. ఇంతమందిని కోలుకునేలా చేశాం అంటూ ప్రకటనలిచ్చి చేతులు దులుపుకోలేదామె! ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన టెస్ట్‌, ట్రేస్‌, ఐసోలేట్‌ను అక్షరాలా పాటించారామె! ఎయిర్‌పోర్టులలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు.. చైనా నుంచి వచ్చేవారిపై ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు.. క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్సింగ్‌, మాస్కులు ఇలాంటి నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఆమె పనితీరే ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి పబ్లిక్‌ సర్వీస్‌ డే సందర్భంగా మాట్లాడే అవకాశం లభించిందంటేనే ఆమె గొప్పదనమేమిటో తెలుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు కూడా శైలజ మేడమ్‌ పనితీరు పట్ల ఇంప్రెస్‌ అవ్వడం మనకు గొప్పేమరి!