Kishan Reddy: ‘జమ్మూకశ్మీర్‌లో జిన్నా రాజ్యాంగమే కావాలా..’ కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A పునరుద్ధరిస్తామంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మేనిఫెస్టోలో ప్రకటించడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాము దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలకు..

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A పునరుద్ధరిస్తామంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మేనిఫెస్టోలో ప్రకటించడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాము దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలకు.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారాయన. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ నేతలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా.. జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారా.? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మహిళా కమిషన్ ఏర్పాటుతో పాటు ఫారెస్ట్ డ్వెల్లర్స్ చట్టం, సఫాయీ కర్మచారి వంటి ఎన్నో చట్టాలు అక్కడ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు రిజర్వేషన్లు లాంటి మార్పులు ఎన్నో జమ్మూకశ్మీర్‌లో తీసుకొస్తే.. వాటిని తొలగించి జిన్నా రాజ్యాంగమే అక్కడుండాలని కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు మాట్లాడుతుంటాయని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ‘శంకరాచార్య హిల్’ పేరు మారుస్తామని ఎన్సీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ సమర్దిస్తుందా.? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో.. రాష్ట్రంలో విభజన రాజకీయాలకు బాటలు వేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ సమాధానమేంటో చెప్పాలని మండిపడ్డారు కిషన్ రెడ్డి.




